– గ్రేటర్ నోయిడాలో యువకుడి దుర్మరణం
13 Oct 2025 (senani.net): ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగిన విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాద్రి ప్రాంతానికి చెందిన తుషార్ అనే యువకుడు నిర్లక్ష్యంగా రైల్వే గేటును దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా, రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మూసి ఉన్న గేటును పట్టించుకోకుండా సాహసంగా వెళ్లేందుకు ప్రయత్నించిన అతని నిర్ణయం చివరకు ప్రాణాపాయం అయింది. సాక్షుల సమాచారం ప్రకారం, తుషార్ బైక్‌పై వచ్చి రైల్వే గేటు మూసి ఉన్నట్లు గమనించాడు. అయినప్పటికీ అతను ఆ గేటు కిందనుంచి బైక్‌ను తీసుకుని పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ నేల నారిగా ఉండడంతో బైక్ అదుపు తప్పి పట్టాల మధ్య జారిపడిరది. ఒక్క క్షణం తుషార్ బైక్‌ను పైకి ఎత్తేందుకు యత్నించగా, అదే సమయంలో వేగంగా రైలు సమీపిస్తోంది. తన బైక్‌ను విడిచి పక్కకు పరిగెత్తాలని చూసేలోపే రైలు ఢీకొట్టడంతో అతడు తుడిచిపెట్టుకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిలో తుషార్ బైక్‌ను లాగేందుకు పడుతున్న తీవ్ర కసరత్తులు, చుట్టూ ఉన్న వారు కేకలు వేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. చాలా మందికి ఇది సాధారణ నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో చూపించే ఉదాహరణగా మిగిలిపోయింది.
ఈ దుర్ఘటన నేపథ్యంగా ఉత్తరప్రదేశ్‌లో రైల్వే క్రాసింగ్‌ల వద్ద భద్రతా చర్యలపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా నమోదైన రైల్వే క్రాసింగ్ ప్రమాదాల్లో యూపీకి అత్యధిక శాతం ఉంది. మొత్తం 2,483 ప్రమాదాల్లో 1,025 ఘటనలు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. మరణాల పరంగా చూస్తే 2,242 మందిలో 1,007 మంది ఈ రాష్ట్రానికి చెందినవారే కావడం పరిస్థితి ఎంత విషమంగా ఉందో తెలుపుతోంది. నిర్లక్ష్యం, అజాగ్రత్త, హెచ్చరికలను పక్కన పెట్టే అలవాటు ఇంకా కొనసాగుతుండటంతో ఇలాంటి ప్రాణ నష్టాలు నమోదవుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే గేటు మూసినపుడు ఒక్క క్షణం ఆగితే ప్రాణం నిలుపుకోవచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని సెకన్లలో ముగించగలవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.



