20 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర!

- – మోదీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు
- – ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని వ్యాఖ్య
- – కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోలేకపోయారంటూ విమర్శ
- – మోదీని గద్దె దించేవరకు విశ్రమించబోమని ప్రతిన
న్యూఢిల్లీ, నవంబర్ 1 (సేనాని ప్రతినిధి): దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 20 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ, 2024 ఎన్నికల్లో 400కు పైగా స్థానాలు సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని భావించిందని విమర్శించారు. ఆ సంఖ్యలో సీట్లు రాకపోవడంతో పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలపై కక్ష పెంచుకుని వారి ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ బహిరంగ సభకు ముందు తెలంగాణ భవన్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించారని, అలాంటి హక్కును తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను అడ్డుపెట్టుకుని ఓటర్ల జాబితాల్లో మార్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, మరో 20 కోట్ల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మొత్తం ఓట్లలో 15 నుంచి 20 శాతం వరకు తొలగించాలనే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల మార్పుల ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలోనూ అదే తరహా ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ నుంచి సుమారు 15 వేల మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు పీసీసీ ఆధ్వర్యంలో రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, చివరి నిమిషంలో వాటిని రద్దు చేసి తమ రాకను అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గకుండా వేలాదిగా ఢిల్లీకి చేరుకున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తల సంకల్పాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అడ్డుకోలేకపోయారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ బలం, తెలంగాణ గొంతుక ముందు వారు తలవంచక తప్పదని అన్నారు. రావణుడిని ఓడించేందుకు రాముడికి వానర సైన్యం తోడ్పడినట్లుగా, నేడు నరేంద్ర మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం సాగిస్తున్నారని అభివర్ణించారు. ఈ పోరాటంలో విజయం సాధించే వరకు విశ్రమించబోమని, మోదీని అధికార పీఠం నుంచి దించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నాయకులు ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్లో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు ఇండియా కూటమి నాయకులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, సంజయ్ రౌత్ తదితరులతో కలిసి బహిరంగ సభకు బయలుదేరారు. నాయకులంతా బహిరంగ వాహనంలో ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి చేరుకున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద, ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కరచాలనం చేసేందుకు, చిత్రాలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నాయి.