22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి

* ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండకూడదు
* కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలి
* పరిష్కారానికి వీలుకాని అంశాలను ఉన్నతస్థాయి కమిటీకి పంపాలి
* అర్హులైన భూ యజమానులకు త్వరగా న్యాయం చేయాలి
హైదరాబాద్, నవంబర్ 12 (సేనాని ప్రతినిధి): ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 22-ఎ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పరిష్కార ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావివ్వకూడదని సూచించారు. 22-ఎ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల అమలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అధికారులు సమర్థంగా అమలు చేయాలని మంత్రి సూచించారు.
జీవో 118, జీవో 76లకు సంబంధించిన మెమోలు, 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని పొంగులేటి తెలిపారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు, జీవో 59 అమలు వంటి అంశాలపైనా దృష్టి సారించాలని చెప్పారు. ఈ ఉత్తర్వుల ప్రయోజనం అర్హులైన దరఖాస్తుదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొన్నారు.
ప్రతి వారం జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, సంబంధిత అధికారులు సమావేశమై 22-ఎ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించడానికి వీలుకాని అంశాలను రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలని సూచించారు. యూఎల్‌సీకి సంబంధించి వివిధ కోర్టులు ఇచ్చిన తుది తీర్పులు, ప్రభుత్వం తరఫున ప్రత్యేక అనుమతి పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు, అలా చేయడానికి వీలులేని ఇతర అంశాలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని కమిటీని ఆదేశించారు.
22-ఎ జాబితాలోని ప్రతి భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి కమిటీ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, క్రమబద్ధీకరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. నిజమైన భూ యజమానులకు హక్కులు కల్పించే విషయంలో అనవసర జాప్యం జరగకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అర్హులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని, అదే సమయంలో ప్రభుత్వ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూముల విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.