– లాహోర్ రణరంగం- టీఎల్‌పీ నిరసన హింసాత్మకం
– పోలీస్ అధికారితో పాటు పలు నిరసనకారుల మృతి, పరిస్థితి ఉత్కంఠ
– సాద్ రిజ్వీ తీవ్ర గాయాలు.. పాకిస్థాన్‌లో పరిస్థితి నియంత్రణలో లేదని ఆందోళన
13 Oct 2025 (senani.net): పాకిస్థాన్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. లాహోర్ నగరంలో టీఎల్‌పీ (తెహ్రీక్ ఎ లబ్బైక్ పాకిస్థాన్) పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ అదుపు తప్పి రణరంగాన్ని తలపించింది. ఈ ఘర్షణల్లో ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా, పలు నిరసనకారులు కూడా మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడిరచారు. కాల్పులు, రాళ్ల దాడులు, బాణాసంచా పేలుళ్లతో నగరం మొత్తం గందరగోళానికి గురైంది.
ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ, పాలస్తీనాకు మద్దతుగా అమెరికా రాయబార కార్యాలయం వైపు లాంగ్ మార్చ్‌గా టీఎల్‌పీ మద్దతుదారులు బయలుదేరారు. ఇస్లామాబాద్ వైపు సాగుతున్న ర్యాలీని ఆపేందుకు పోలీసులు రోడ్లను కంటైనర్లతో మూసివేశారు. వాటిని తొలగించాలని ప్రయత్నించిన ఆందోళనకారులు మరియు భద్రతా బలగాల మధ్య వాగ్వాదం మొదలై కొద్ది సేపటికే కాల్పుల వరకు దారితీసింది. పంజాబ్ పోలీస్ అధికారి ఉస్మాన్ అన్వర్ వివరాల ప్రకారం, నిరసనకారులు ముందుగా ఆయుధాలతో దాడికి దిగారని, ఒక సీనియర్ పోలీస్ అధికారి అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడిరచారు. ఇదే విషయంపై టీఎల్‌పీ నాయకత్వం మాత్రం భిన్నంగా ఆరోపించింది. తమ మద్దతుదారులపై పోలీసులే విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఎన్నోమంది ప్రాణాలు కోల్పోయారని పార్టీ ఆరోపించింది. ఈ ఘర్షణల్లో టీఎల్‌పీ చీఫ్ సాద్ రిజ్వీ కూడా బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారని, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పార్టీ ప్రకటనలో పేర్కొంది. కాల్పులు ఆపాలని భద్రతా సిబ్బందిని కోరుతూ రిజ్వీ విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో సమయంలో కూడా కాల్పుల శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. లాహోర్‌లోని అనేక రహదారులపై నిరసనకారులు మంటలు పెట్టారు. వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసుల అదుపు చర్యల్లో ఇప్పటికే వంద మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ప్రధాన కమ్యూనికేషన్ మార్గాలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచే బయటకు రావడానికి భయపడుతున్నారు. ఆసుపత్రుల్లో గాయపడిన వారితో హడావుడి వాతావరణం నెలకొంది.
గాజా ఘర్షణలు తగ్గుముఖం పడుతున్న సమయంలో టీఎల్‌పీ ఇలా హింసకు దిగడం అర్థం కావడం లేదని పాకిస్థాన్ ఉప అంతర్గత వ్యవహారాల మంత్రి తలాల్ చౌదరి తెలిపారు. రాజకీయ పార్టీలు ఇలాంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టకూడదని ఆయన హెచ్చరించారు. లాహోర్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో అదనపు బలగాలు మోహరించబడ్డాయి. ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.



