– నేర్చుకోవడం జీవితం మారుస్తుందనే సందేశానికి అంకితం
14 Oct 2025 (senani.net):జాతి పురోగతికి మార్గదర్శకం విద్య అని అందరూ అంగీకరించినా, దాని మహ్షన్ని హృదయానికి హత్తుకునేలా గుర్తుచేసే ప్రత్యేక రోజు అరుదుగా వస్తుంది. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశమంతా విద్యా దినోత్సవాన్ని ఆచరించడం ఒక సాధారణ ఆచారం కాదు ఇది జ్ఞానం మాత్రమే నిజమైన శక్తి అన్న భావనకు దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రతిజ్ఞ. విద్య కేవలం పాఠశాల గోడల మధ్య పరిమితమైతే అది సర్టిఫికేట్ మించదు. కానీ మనస్సును మేల్కొలిపి, ఆలోచనలను ప్రశ్నించే దిశగా నడిపితేనే అది నిజమైన విద్య అవుతుంది. ఈ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి, కేవలం పిల్లలకే కాదు, ప్రతి మనిషికి జీవితాంతం నేర్చుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేయడానికి విద్యా దినోత్సవం ఆచరించబడుతోంది. ఈ రోజు దేశంలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామ గ్రంథాలయాలు, సైన్స్ సెంటర్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. పాఠాలు చెప్పడం కాదు, ప్రేరణ కలిగించడం లక్ష్యం. చిన్నపిల్లలకు కలలు కనాలని నేర్పించడం, యువతకు బాధ్యత గుర్తుచేయడం, పెద్దలకు నేర్చుకోవడం ఆపొద్దని సూచించడం ు ఇవే ఈ దినోత్సవానికి నిజమైన ఉద్దేశాలు.
విద్య అంటే పుస్తకాల పఠనం మాత్రమే కాదు, జీవితం అర్థం చేసుకోవడానికి కావలసిన దారి. కొత్త విషయాలపై ఆసక్తి కలిగించడం, ప్రశ్నించే ధైర్యం ఇవ్వడం, సమాజంలో మంచి చెడుల మధ్య తేడా గ్రహించే తీర్పు తీర్చడం ఇవన్నీ విద్య లక్ష్యాలు. ఈ దినోత్సవం వాటినే గుర్తుచేస్తూ మనసుల్లో మంట చల్లుతుంది.
అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు, విద్య ద్వారా మనసులు వెలుగొందితే దేశం అంధకారంలో ఉండదు. కేవలం కొద్ది మంది తెలివిగలవారు తయారైతే దేశం ఎదగదు, ప్రతి సాధారణ వ్యక్తి ఆలోచించేలా మారితేనే అసలు స్వాతంత్య్రం సార్థకం అవుతుంది. విజ్ఞానం పేరుతో బందీలుగా కాకుండా, విజ్ఞానం ద్వారా స్వతంత్ర ఆలోచనా శక్తి కల్గిన పౌరులుగా మారడమే విద్యా దినోత్సవం సూచించే మార్గం. ఈ రోజునే కాదు, ప్రతి రోజు చిన్న ప్రయత్నం చేయాలి పుస్తకం ఒకటి తిప్పి చూడాలి, ఒక మంచి ఆలోచనను ఆచరణలో పెట్టాలి, ఒక ప్రశ్న మనలో వేసుకోవాలి నేను నేడు కొత్తగా ఏమి నేర్చుకున్నాను? ఈ ప్రశ్న మన గుండెల్లో వినిపిస్తే, విద్యా దినోత్సవం నిజమైన అర్థాన్ని అందుకుంది అన్న మాట. జ్ఞానం చిగురించాలి, ఆలోచన వికసించాలి, సమాజం మారాలి.. ఇదే విద్యా దినోత్సవ పిలుపు.
విద్యను ఒక పండుగలా ఆచరించడం వెనుక అసలు ఉద్దేశం చదువు పట్ల ఉత్సాహాన్ని తిరిగి రగిలించడం. ఒకప్పుడు పాఠశాలలు కేవలం బోధన కేంద్రాలు కాకుండా, జీవితం నేర్పే ప్రదేశాలు అయ్యేవి. గురువు ఒక ఉద్యోగి కాదు, జ్యోతి వెలిగించే దీపస్తంభం. విద్యా దినోత్సవం అనేది గురువుల పాత్రను కూడా మనకు గుర్తు చేస్తుంది చదువును మోపడం కాదు, నేర్చుకోవడంపై ఆకలి కలిగించడం గురువు బాధ్యత అని కలాం గారి ఆలోచన. గురువు చూపే ఆలోచనా దారి దేశపు ఆత్మను మలుస్తుంది. ఈ రోజు కేవలం పాఠశాల స్థాయి వేడుకలకే పరిమితం అయితే ప్రయోజనం సగమే. విద్య అనేది ఒక నిరంతర యాత్ర, గమ్యం లేని శోధన అని అర్థం చేసుకునే తరుణం ఇది. ఒక రైతు కొత్త సాంకేతికత నేర్చుకోవడం, ఒక కార్మికుడు తన పనిని మెరుగుపరుచుకునే కొత్త మార్గం తెలుసుకోవడం, ఒక గృహిణి ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన సంపాదించడం ఇవన్నీ విద్యే. చదువు పుస్తకాల్లో ఉండదు, జీవితాన్ని మార్చే ఆలోచన ఏ రూపంలో వచ్చినా అది విద్యే.
కలాం గారు చెప్పినట్టు, ‘‘చదివి బతికేవాళ్లు కావాలి, చదివి మార్చేవాళ్లు కావాలి’’. ఈ దేశానికి కేవలం డిగ్రీలు కాదు, దారులు తెరవగల ఆలోచనలతో ఉన్న మనుషులు అవసరం. అటువంటి మనుషులు పుడేది ర్యాంకులు సాధించే పోటీలో కాదు, సమాజం గురించి ఆలోచించే మనసు కలిగిన విద్యలోనే. విద్యా దినోత్సవం మనకు గుర్తుచేస్తుంది ు సమాజం మారుతుంది అంటే ముందుగా మన ఆలోచన మారాలి. అందుకే ఈ ప్రత్యేక దినం ముగిసిన తర్వాత కూడా, ఈ రోజు రేపటి చర్యలలో జీవించాలి. ఒక పిల్లవాడి ప్రశ్నను నిర్లక్ష్యం చేయకుండా వినడం, ఒక విద్యార్థికి కలలు కనమని ప్రోత్సాహం ఇవ్వడం, జ్ఞానం పంచే ప్రయత్నం చేయడం ు ఇవే విద్యా దినోత్సవానికి నిజమైన నివాళులు. పుస్తకాలపై ధూళి పేరనీయకుండా, ఆలోచనలపై జడత్వం రానీయకుండా ఉండడమే మన బాధ్యత.



