14 Oct 2025 (senani.net): చైనా-అమెరికా ట్రేడ్ వార్ అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అమెరికా మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. ఆ ప్రభావంతో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలతోనే ముగిశాయి. ఫార్మా, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి. సోమవారం ముగింపు (82, 029)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 80 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 550 పాయింట్లు నష్టపోయి 81, 781 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల నుంచి కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 297 పాయింట్ల నష్టంతో 82, 029 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడిరది. చివరకు 81 పాయింట్ల నష్టంతో 25, 145 వద్ద స్థిరపడిరది. సెన్సెక్స్‌లో ఎమ్‌సీఎక్స్ ఇండియా, సోనా బీఎల్‌డబ్ల్యూ, ఇండియన్ రెన్యుబుల్, 306 వన్ వామ్, మ్యాక్స్ హెల్త్‌కేర్ మొదలైన షేర్లు లాభాలతో ముగిశాయి. టాటా మోటార్స్, డిక్సన్ టెక్నాలజీస్, వోడాఫోన్ ఐడియా, యూనో మిండా, బంధన్ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 437 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్లు దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.80గా ఉంది.



