– భయం కాదు, నైపుణ్యమే భవిష్యత్తు
– పని మారుతోంది, మనం మారుతున్నామా?
15 Oct 2025 (senani.net): మనుషుల ఆలోచన శక్తిని అనుకరించడానికి రూపొందిన కృత్రిమ మేధస్సు ఇప్పుడు జీవనంలో ప్రతి కోణాన్ని తాకుతోంది. పదేళ్ల క్రితం వరకు ఇది భవిష్యత్తు సాంకేతికతగా మాత్రమే భావించబడిరది. కానీ ఇప్పుడు బ్యాంకులు, దవాఖానలు, వ్యవసాయ రంగం, విద్య సంస్థలు, మీడియా సంస్థలు ఇలా ఎక్కడ చూసినా ఈ మేధస్సు ఆధారిత విధానాలు ప్రవేశిస్తున్నాయి. ఒక సాధారణ ప్రశ్న కూడా మనిషిని అడగకుండా యంత్రాన్ని అడగడం మనకు సహజమైపోయింది. ఈ మార్పు ఆశ్చర్యకరమైనదే కానీ దీనికొక పక్క భయం కూడా వెంటాడుతోంది మన పని అవసరం తగ్గిపోతుందా అని. కృత్రిమ మేధస్సు పనిలో వేగాన్ని పెంచుతుంది, తప్పులు తగ్గిస్తుంది, ఖర్చు నియంత్రణలో సహాయపడుతుంది అనే వాదన బలంగా ఉంది. ఉదాహరణకు బ్యాంకులలో ఒక పనికి పది మంది అవసరమైన చోట ఇప్పుడు రెండుగురు చాలు అంటున్నారు. మిగతావన్నీ యంత్రం స్వయంగా చేసేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులను పరిశీలించడం, నివేదికలు తయారు చేయడం వంటి పనులను ఆటోమేటిక్ విధానాలకు అప్పగిస్తున్నారు. ప్రజలు వేగంగా సేవ అందుకుంటున్నప్పటికీ, ఈ మార్పు ఉద్యోగాలపై మబ్బులా కమ్ముకుంటోంది.
ఇంకొక వైపు కృత్రిమ మేధస్సు కొత్త అవకాశాలను కూడా తెరుస్తోంది. ఈ యంత్రాలకు ఆదేశాలు ఇవ్వగల, వాటి పనితీరును పర్యవేక్షించగల మనుషులు అవసరం అవుతున్నారు. పనిని చేసే శారీరక శ్రామిక శక్తి తగ్గుతూ, నిర్ణయం తీసుకునే మానసిక సామర్థ్యం విలువ పెరుగుతోంది. ఇది చూసితే ఉద్యోగాలు పూర్తిగా పోవడం కాదు, వాటి స్వభావం మారిపోతుందని గ్రహించాలి. సంప్రదాయ పనులు తగ్గినా, కొత్త నైపుణ్యాల అవసరం పెరుగుతోంది. పాత పద్ధతులు ఆధారపడిన వారు భయపడుతుంటే, నేర్చుకునేందుకు సిద్ధమైన వారు ఈ మార్పును అవకాశంగా చూస్తున్నారు.
కృత్రిమ మేధస్సు మీద ఆధారపడే సమాజం సమానతను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. దాన్ని ఉపయోగించగల సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ముందుకు దూసుకుపోతే, ఆ పరిజ్ఞానం లేని వారు వెనుకపడే అవకాశముంది. ఇదే దశలో ప్రభుత్వాల బాధ్యత మొదలవుతుంది. సాంకేతిక విజ్ఞానంపై శిక్షణలను అందుబాటులోకి తీసుకురావడం, విద్యలో నైపుణ్యాల ఆధారిత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడం, గ్రామీణ యువతకు అవకాశాలను చేరువ చేయడం వంటి చర్యలు తీసుకోకపోతే ఈ మార్పు ఉద్యోగ అసమానతను మరింత పెంచుతుంది.
మొత్తం చూస్తే కృత్రిమ మేధస్సు ఒక సవాలు కూడా, ఒక అవకాశం కూడా. దాన్ని ఎవరూ ఆపలేరు కానీ దాన్ని అర్థం చేసుకుని వినియోగించుకోవాలని నిర్ణయించుకోవడమే మన చేతుల్లో ఉంది. భయం సహజమే కానీ ఆ భయం మనల్ని నేర్చుకోవడం ఆపేస్తే అదే నిజమైన హాని. రాబోయే రోజులలో పనిని రక్షించుకోవాలంటే ఉద్యోగం కాదు, నైపుణ్యం ప్రధానంనని గ్రహించాలి. నేర్చుకునే మనస్తత్వం ఉన్నవారు యంత్రాలతో కలిసి నడుస్తారు, వెనుకంజ వేసేవారు మాత్రం యంత్రాల మోగడిని భయంతో మాత్రమే చూస్తారు.
– విశ్లేషణ : M రాజు పాత్రికేయులు,
సేనాని (senani.net): ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు నీడ
RELATED ARTICLES



