– ఆధునిక జీవనశైలి మనల్ని ఎంత మారుస్తోంది
15 Oct 2025 (senani.net): మన భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ప్రత్యేకమైంది అని గర్వంగా చెప్పుకునే మన సమాజంలో ఇప్పుడు ఒక నిశ్శబ్ద మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇంటి పెద్దల మాటే ఇంటి ధర్మం, వారి సాన్నిహిత్యమే ఇంటి సౌభాగ్యం అని భావించేవారు. కానీ కాలం మారింది, జీవనపద్ధతి మారింది, మనసుల లెక్కలు కూడా మారిపోయాయి. ఈ మార్పులో అత్యంత బాధాకరమైన దృశ్యం ఏమిటంటే వృద్ధులు తమ సంతానం ఉన్నప్పటికీ వృద్ధాశ్రమాలకు వెళ్లాల్సిన పరిస్థితికి రావడం. ఇది కేవలం వారి జీవనసౌకర్యానికి తీసుకున్న నిర్ణయమా లేదా మన సంస్కృతికి ఎదురైన ఓ చేదు ప్రశ్నా అనే ఆలోచన మన మనస్సుల్లో మెదలడం సహజం. ఆధునిక జీవనశైలి వేగంగా మారుతోంది. ఉద్యోగాల కోసం పిల్లలు పట్టణాలకు, విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ జీవన పోరాటం తీవ్రమై కుటుంబ జీవితం గడపడం కష్టం అవుతోంది. డబ్బుతో కూడిన సౌకర్యాలు ఉన్నా సమయం కొరత. ఈ టైం శూన్యతే ఇంటి పెద్దలకు దూరాన్ని కలిగిస్తోంది. కొందరు తమ పెద్దలను చూసుకునే సామర్థ్యం మనకు లేదని చెప్పి వృద్ధాశ్రమాలను ఆశ్రయంగా భావిస్తున్నారు. అక్కడ వారికి సౌకర్యాలు ఉంటాయని భావించి ఈ నిర్ణయాన్ని సమకాలీనత పేరుతో సరైనదిగా చూపే ప్రయత్నం కూడా జరుగుతోంది.
కానీ వాస్తవం ఏమిటంటే వృద్ధాశ్రమం ఒక ఇంటి ప్రత్యామ్నాయం కాదు. అది ఒక ప్రత్యామ్నాయం తప్ప, ఆప్యాయతల జీవనశైలికి మారుపేరు కాదు. పెద్దలు కోరేది కేవలం ఆహారం, మందులు మాత్రమే కాదుబీ మాట మాట్లాడే ఓ మనసు, తమను వినే ఓ చెవి, వారి అనుభవాలను విలువైనవిగా భావించే ఓ చూపు. ఈ భావోద్వేగ అవసరాలను ఏ సంస్థ కూడా పూర్తిగా తీర్చలేం. సౌకర్యాల తో కూడిన వృద్ధాశ్రమం ఉన్నా, ఇంటి ఒడిలో ఉండే ఆత్మీయత అందుబాటులోకి రాదు.
మరొకవైపు, వృద్ధాశ్రమాలకు పంపడం వెనుక ఉన్న భావజాలం కూడా ప్రశ్నించదగినదే. పెద్దల సంరక్షణను ఒక బాధ్యతగా కాకుండా భారం అని చూడటమే పెద్ద సమస్య. వారిని చూసుకోవడం అంటే మన జీవిత వేగం తగ్గిపోతుందని అనుకోవడం ఆధునిక మనస్తత్వంలో పెరుగుతున్న చల్లదనం. చిన్నప్పుడు మన బాల్యాన్ని మోసిన చేతులను ఇప్పుడు మనం కాలంతో నెట్టి దూరం చేస్తే అది కేవలం సంబంధం కోల్పోవడం కాదు, మనశ్శాంతి కోల్పోవడమూ కూడా.
సమస్యకు పరిష్కారం వృద్ధాశ్రమాలను తప్పుబట్టడం కాదు, మన జీవనశైలిలో మానవీయతను మళ్లీ నాటుకోవడమే. పెద్దలను ఇంట్లో చూసుకోవడం సాధ్యం కాని పరిస్థితులు నిజంగా ఉన్నప్పుడు వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించే ప్రయత్నం చేయాలి. కానీ సామర్థ్యం ఉన్నప్పటికీ వారిని దూరం చేయడం మన విలువల వ్యవస్థ బలహీనపడుతున్నదనడానికి నిదర్శనం. కుటుంబం అంటే కలిసి ఉండడమే కాదు, కలిసి భావించడం కూడా. పెద్దలను మన జీవితంలో ఒక మూలన పెట్టడం కాదు, మనసుకు మధ్యలో ఉంచుకోవడమే కుటుంబ ధర్మం.
మన పిల్లలకు ఇచ్చే అత్యంత గొప్ప పాఠం పుస్తకాల ద్వారా కాదు, మన ప్రవర్తన ద్వారా. పెద్దల పట్ల మన వైఖరినే వారు తమ భవిష్యత్తు సంబంధాల బ్లూప్రింట్‌గా చూస్తారు. మనం వారికి దగ్గరగా ఉంటేనే వారు మనకు దగ్గరగా ఉంటారు. వృద్ధాశ్రమాల పెరుగుతున్న సంఖ్య మన అభివృద్ధికి గుర్తు కాదు, మన సంబంధాల తగ్గుతున్న ఉష్ణానికి గుర్తు. కాలం ఎంత మారినా మనసు చల్లగా మారకూడదనే అవగాహన కలిగినప్పుడు మాత్రమే మన కుటుంబ వ్యవస్థ మళ్లీ బలపడుతుంది.
– విశ్లేషణ : M రాజు పాత్రికేయులు,
సేనాని (senani.net):వృద్ధాశ్రమాల బాటలో పెద్దల అడుగులు
RELATED ARTICLES



