15 Oct 2025 (senani.net):తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడంతో అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్ స్పందిస్తూ, ర్యాలీకి విజయ్ సమయానికి రాకపోవడం వల్లే గందరగోళం నెలకొందని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం వస్తారని ప్రకటించడంతో వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారని, కానీ ఆయన రాత్రి ఆలస్యంగా రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని వివరించారు. ప్రచార వాహనం నేరుగా జనసందోహం మధ్యకు తీసుకెళ్లడం కూడా పెద్ద తప్పిదమని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ చర్య కారణంగానే గందరగోళం చెలరేగి, తొక్కిసలాట చోటుచేసుకుందని అన్నారు. టీవీకే పార్టీ నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, తాగునీరు, వైద్య సదుపాయాలు సహా ప్రాథమిక ఏర్పాట్లు సరిగా చేయలేదని విమర్శించారు.
ఈ ఘటనలో అంబులెన్సులు సహాయం అందించేందుకు ప్రయత్నించగా, టీవీకే కార్యకర్తలు రెండు అంబులెన్సులపై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులపై ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని వెల్లడిరచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు సీబీఐ విచారణకు అప్పగించబడిరదని గుర్తుచేశారు. విజయ్ ర్యాలీకి అనుమతులు ఎలా మంజూరు చేశారని ప్రతిపక్షాలు సభలో ప్రశ్నించడంతో వాతావరణం ఒకింత వేడిగా మారింది.



