15 Oct 2025 (senani.net): బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢల్లీి హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన పక్షాన తీర్పు ఇచ్చింది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత లక్షణాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని కోర్టు స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. హృతిక్ పిటిషన్లో కొంతమంది వ్యక్తులు మరియు ఈ-కామర్స్ సంస్థలు ఏఐ సాంకేతికతను ఉపయోగించి తన రూపాన్ని మార్ఫింగ్ చేసి, ప్రొడక్ట్ ప్రమోషన్ల కోసం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన హైకోర్టు, హృతిక్ అనుమతి లేకుండా ఆయనకు సంబంధించిన ఏ రూపంలోనైనా కంటెంట్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఏఐ జనరేటెడ్ అభ్యంతరకర కంటెంట్ లేదా లింకులు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పెరుగుతున్న ఏఐ దుర్వినియోగంపై కీలక సూచనగా మారింది. ఇటీవల నాగార్జున, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఇలాంటి ఫిర్యాదులతో కోర్టులను ఆశ్రయించిన విషయం గుర్తుచేయదగినది.



