ఐనవోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన వరంగల్ సీపీ

- – రికార్డులు, కేసుల వివరాలను పరిశీలించిన ఎన్. శ్వేత
- – ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశం
- – భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచన
- – సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హితవు
వరంగల్, నవంబర్ 13 (భారత్ ప్రతినిధి): వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత శుక్రవారం ఐనవోలు పోలీస్ స్టేషన్ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. స్టేషన్కు చేరుకున్న ఆమెకు పోలీసు అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ కొబ్బరి మొక్కను నాటారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. పెండింగ్ కేసులు, సిబ్బంది విధుల నిర్వహణ, బాధ్యతలు, పోలీస్ స్టేషన్ పనితీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎన్. శ్వేత సిబ్బందికి సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, బాధితులకు న్యాయం జరిగేలా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.
ఐనవోలులో శ్రీ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం ఉన్నందున ఇక్కడికి వచ్చే భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీపీ సూచించారు. భక్తుల మనోభావాలు, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీసు శాఖ ప్రతిష్ఠను కాపాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని ఎన్. శ్వేత సూచించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ సంతోష్, ఐనవోలు ఎస్ఐ అశోక్, సంగెం ఎస్ఐ వంశీకృష్ణ, పర్వతగిరి ఎస్ఐ రాజ్కుమార్తో పాటు ఐనవోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.