అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం.. !

వాషింగ్టన్, నవంబరు 12 (సేనాని ప్రతినిధి): ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికంగా జరిగే సుమారు 60 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై మరింత అనుకూలమైన దిగుమతి సుంకాల విధానాన్ని అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఎనిమిదో విడత ఆర్థిక, వాణిజ్య చర్చల అనంతరం చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ కూడా కొత్తగా ఏర్పాటైన ‘యూఎస్-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్’ పరిధిలో ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించినట్లు సమాచారం.
ఈ ఒప్పందం ప్రకారం అన్ని దిగుమతి సుంకాలను పూర్తిగా తొలగించనప్పటికీ, గత వాణిజ్య వివాదాల సమయంలో విధించిన అదనపు ప్రతీకార సుంకాల నుంచి 90 శాతానికి పైగా ఉత్పత్తులకు ఉపశమనం లభించనుంది. ఆయా వస్తువులపై సాధారణ అత్యంత ప్రాధాన్య దేశం (ఎంఎఫ్ఎన్) సుంకాల రేట్లు వర్తించనున్నాయి.
బొమ్మలు సహా పలు వస్తువులకు రాయితీలు
అమెరికా సుంకాల రాయితీలు కల్పించనున్న చైనా ఉత్పత్తుల జాబితాలో బొమ్మలు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటితో పాటు పిల్లల సైకిళ్లు, వంటగది సామగ్రి, గృహోపకరణాలు, దుప్పట్లు, పిల్లల కారు సీట్లు, పండుగ అలంకరణ వస్తువులకు కూడా సుంకాల నుంచి ఊరట కల్పించనుంది. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపడటంతో పాటు దిగుమతిదారులు, వినియోగదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.