అంగులూరులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ!

అంగులూరులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ!
  • – టీడీపీలో చేరిన 60 బీసీ కుటుంబాలు
  • – మెరుగుమాల బాలు నేతృత్వంలో పార్టీ మార్పు
  • – కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
  • – కూటమి అభ్యర్థుల విజయానికి కొనకళ్ల బుల్లయ్య పిలుపు

గుడ్లవల్లేరు, నవంబర్‌ 2 (సేనాని ప్రతినిధి): కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 60 బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ మెరుగుమాల బాలు నేతృత్వంలో ఆయా కుటుంబాల సభ్యులు పార్టీ మారారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, ఆంధ్రప్రదేశ్‌ గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. నూతనంగా పార్టీలో చేరిన వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచే ప్రజాస్వామ్య విధానాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఒకే కుటుంబంలా కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో పాటు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభివృద్ధి దృక్పథం నచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మెరుగుమాల బాలు తెలిపారు. ముఖ్యంగా రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాము వారికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ వారికి సహకారం అందిస్తున్న తీరు తమను ఆకర్షించిందని పేర్కొన్నారు. గ్రామంలో మరింత అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతో తమ అనుచరులు, బీసీ కుటుంబాలతో కలిసి పార్టీలో చేరినట్లు వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య పిలుపునిచ్చారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ గుడ్లవల్లేరు మండల జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణతోపాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
అంగులూరులో 60 బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం స్థానికంగా పార్టీ బలాన్ని పెంచుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో ప్రజల మద్దతుతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కొత్తగా చేరిన కుటుంబాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ, వారి అభిప్రాయాలు, సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలు కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.