అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు: మంత్రి పొంగులేటి

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు: మంత్రి పొంగులేటి
  • – నేలకొండపల్లిలో 1,138 మందికి మంజూరు పత్రాల పంపిణీ
  • – కొత్త లబ్ధిదారులకు నెలకు రూ.30.16 లక్షల ఆర్థిక సాయం
  • – దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు లబ్ధి
  • – అర్హులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా

ఖమ్మం, నవంబర్‌ 13 (భారత్ ప్రతినిధి): అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు మంజూరు చేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో చేయూత పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో కొత్తగా పింఛన్లు మంజూరైన 1,138 మందికి పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎనిమిదేళ్ల పాటు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని విమర్శించారు. అర్హులైన పేదలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, ఏళ్ల తరబడి ఎదురుచూసినా అప్పటి పాలకులు స్పందించలేదని అన్నారు. ఎన్నికలకు ముందు పర్యటనల్లో పేదల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయానని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టిందని వివరించారు.
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు అందించనున్నట్లు ప్రకటించి, ఆ హామీని అమల్లోకి తెచ్చామని పొంగులేటి తెలిపారు. గత పాలకులు కమీషన్ల కోసం లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, చివరకు అది కూలేశ్వరంగా మిగిలిందని విమర్శించారు. ఇంకా అర్హులైన వారు ఉంటే పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. నేలకొండపల్లి మండలంలో కొత్తగా 1,138 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో 361 మంది దివ్యాంగులకు నెలకు రూ.14,49,776, 107 మంది ఒంటరి మహిళలకు రూ.2,15,712, 64 మంది గీత కార్మికులకు రూ.1,29,024, ఇద్దరు చేనేత కార్మికులకు రూ.4,032, 604 మంది వితంతువులకు రూ.12,17,664 చొప్పున నెలవారీ పింఛను అందనుంది. దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.4,016, మిగిలిన వర్గాలకు రూ.2,016 చొప్పున మంజూరు చేశారు. మొత్తంగా కొత్త లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.30,16,208 అందనుంది.
పాత పింఛన్లతో కలిపి నేలకొండపల్లి మండలంలో మొత్తం 9,428 మందికి నెలకు రూ.1,64,40,896 మేర ఆర్థిక సహాయం అందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీజ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు, నాయకులు శాఖమూరి రమేష్‌, నెల్లూరి భద్రయ్య, మార్కెట్‌ చైర్మన్‌ వెన్నపూసల సీతారాములు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.