ఆస్ట్రేలియాతో వ్యాపార సంబంధాల బలోపేతానికి కృషి: మంత్రి కొల్లు రవీంద్ర

- * ఆస్ట్రేలియా ప్రతినిధులతో మంత్రి ప్రత్యేక సమావేశం
- * గనులు, ప్రయోగశాలలు, శుద్ధి కర్మాగారాల సందర్శనకు ఆహ్వానం
- * పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను పరిశీలించే అవకాశం
- * ఏపీ–ఆస్ట్రేలియా మధ్య వ్యవస్థీకృత వ్యాపారానికి ప్రణాళిక
విశాఖపట్నం, నవంబర్ 12 (సేనాని ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆస్ట్రేలియా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ, విధాన పరిశోధన విశ్లేషకులు అభిజిత్ నాయర్, జానకి శ్రీరామ్ పాల్గొన్నారు. సమావేశంలో ఆస్ట్రేలియాలోని గనుల రంగం, పరీక్షా ప్రయోగశాలలు, శుద్ధి కర్మాగారాలు, పరిశోధన–అభివృద్ధి కేంద్రాలను సందర్శించాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆహ్వానం అందింది. ఆయా రంగాల్లో అక్కడ అనుసరిస్తున్న విధానాలు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల నిర్వహణ తీరును ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఈ పర్యటన ద్వారా లభించనుంది.
ఆస్ట్రేలియాలోని పారిశ్రామిక సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను విస్తరించేందుకు మార్గం సుగమం కావచ్చని సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా గనుల తవ్వకం, ఖనిజాల పరీక్షలు, శుద్ధి ప్రక్రియలు, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య కేవలం సంప్రదింపులకే పరిమితం కాకుండా, దీర్ఘకాలికంగా కొనసాగగలిగే వ్యవస్థీకృత వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని సంబంధిత సంస్థలను సందర్శించడం ద్వారా ఇరు ప్రాంతాల మధ్య పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, పరిశోధనా కేంద్రాల అనుసంధానానికి అవసరమైన కార్యాచరణను రూపొందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా వివిధ దేశాల ప్రతినిధులతో జరుగుతున్న సమావేశాలు రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని ఆకర్షించే దిశగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన భేటీని ఏపీ–ఆస్ట్రేలియా వ్యాపార సంబంధాల విస్తరణకు ఒక అవకాశంగా మంత్రి కొల్లు రవీంద్ర అభివర్ణించారు.