ఆత్మగౌరవమే కొత్త పార్టీకి పునాది

- – కొత్త రాజకీయ పార్టీతో విజయసాయి రెడ్డి
- ఈ నెల 11న పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడి
- అన్ని కులాలు, మతాలు, వర్గాలకు సమన్యాయం ప్రధాన లక్ష్యం
- జగన్ వ్యవహారశైలితోనే వైకాపా నుంచి బయటకు వచ్చా
- ఆత్మగౌరవాన్ని చంపుకోలేక పార్టీని వీడాల్సి వచ్చిందని వ్యాఖ్య
అమరావతి, నవంబర్ 6 (సేనాని ప్రతినిధి): మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అమరావతిలో మీడియా ముందుకు వచ్చిన ఆయన ఈ నెల 11వ తేదీన నూతన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్తూరుకు చెందిన సుమతి, విశాఖపట్నానికి చెందిన బోనీ గణేష్ విజయసాయి రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన లక్ష్యాలు, విధివిధానాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. సమాజంలోని అన్ని కులాలు, మతాలు, సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ ప్రధాన లక్ష్యమని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన, సమన్యాయం కోసం నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తోందని తెలిపారు. ఈ పార్టీ ఏ ఒక్క రెండు కులాలకో, రెండు కుటుంబాలకో పరిమితమైనది కాదని, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించేలా పనిచేస్తుందని వివరించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ రాజకీయ ప్రయాణానికి పునాదిగా ఉంటుందని పేర్కొన్నారు.
వైకాపాను వీడటంపై స్పందిస్తూ.. జగన్ను వదిలి వెళ్లాలని తాను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే పార్టీలో తనకు ఎదురైన పరిణామాలు, జరిగిన అవమానాల కారణంగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. పలుమార్లు తీవ్ర అవమానాలు ఎదురైనా జగన్ వాటిని పట్టించుకోకుండా వ్యవహరించారని విమర్శించారు. తనను పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.
పార్టీలో ఆత్మగౌరవానికి భంగం కలిగించే పరిస్థితులను ఇక భరించలేకపోయానని విజయసాయి రెడ్డి తెలిపారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యం కాకపోవడంతోనే వైకాపా నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీ కోసం పనిచేసినప్పటికీ తనకు తగిన గౌరవం దక్కలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత గౌరవం, ఆత్మాభిమానం కూడా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తనను ఎప్పుడూ అవమానించలేదని, అయితే జగన్ మాత్రం ఇతరులు చెప్పిన మాటలు విని తనను అవమానించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూనే, జగన్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 11న కొత్త పార్టీ పేరును ప్రకటించనున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి రాజకీయ అడుగులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్న ఆసక్తి నెలకొంది.