బాల్య జ్ఞాపకాల ‘సమ్మర్ హాలిడేస్’.. మూవీ రివ్యూ

హైదరాబాద్, నవంబరు 6 (సేనాని ప్రతినిధి): పల్లెటూరి వాతావరణం, అమాయకమైన స్నేహం, మధురమైన బాల్యపు జ్ఞాపకాల కలయికగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. అగ్రతారలు లేకుండా బలమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు శ్రీకర్ నయన్.జి దర్శకత్వం వహించారు. రోహన్ రాయ్, అరుణ్ దేవ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో నటించగా.. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? తెలుసుకుందాం.
కథేంటంటే?
పట్నంలో చదువుకుంటున్న ఆర్వీ (అరుణ్ దేవ్) తండ్రి (హర్షవర్ధన్) మార్కుల కోసం పెట్టే ఒత్తిడితో సంతోషంగా ఉండలేకపోతుంటాడు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమున్నా ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోతాడు. వేసవి సెలవులు రావడంతో తల్లితో కలిసి అమ్మమ్మ (జయసుధ) ఊరికి వెళ్తాడు. అక్కడ కేవీ (రోహన్ రాయ్)తో పరిచయం ఏర్పడి, అది మంచి స్నేహంగా మారుతుంది.
పైకి సరదాగా కనిపించే కేవీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. తాగుడుకు బానిసైన తండ్రి మరణం, అప్పుల భారం మధ్య తల్లిని (హర్షిణి) కష్టపడి చూసుకుంటుంటాడు. తన తల్లికి ఓ చీర కొనివ్వాలన్నది అతడి కోరిక. మరోవైపు వర్మ (రాజీవ్ కనకాల) తోటలోని మామిడి చెట్లను లీజుకు తీసుకుని పంట పండించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ వేసవి సెలవుల్లో కేవీ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఆర్వీ తన భయాలను ఎలా అధిగమించాడు? ఈ ప్రయాణంలో సుమతి (బేబీ ఖుషి) పాత్ర ఏమిటి? అన్నదే కథ.
విశ్లేషణ
సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అమ్మమ్మ ఊరు, మామిడి తోటలు, కొబ్బరి మట్టలతో క్రికెట్ ఆడుకోవడం, చెరువులో ఈత కొట్టడం వంటి అనుభవాలను దర్శకుడు సహజంగా తెరపై చూపించారు. ఆర్వీ, కేవీల స్నేహం, వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు కథను ఆహ్లాదకరంగా నడిపిస్తాయి. మామిడి తోట చుట్టూ అల్లుకున్న కథనం కూడా ఆసక్తిని కలిగిస్తుంది.
ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. పుట్టినరోజు వేడుకలు, కొన్ని కుటుంబ సన్నివేశాలు, చివర్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో కథనం ముందే ఊహించగలిగేలా సాగుతుంది. అయినప్పటికీ బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
నటీనటులు, సాంకేతికత
రోహన్ రాయ్, అరుణ్ దేవ్ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య స్నేహానికి సంబంధించిన సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. అమ్మమ్మ పాత్రలో జయసుధ మరోసారి తన అనుభవంతో ఆకట్టుకున్నారు. కేవీ తల్లిగా హర్షిణి, ఆర్వీ తల్లిదండ్రులుగా వాసుకి, హర్షవర్ధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాజీవ్ కనకాల పాత్ర కూడా కథకు బలాన్నిచ్చింది.
సాంకేతికంగా సినిమా మంచి ప్రమాణాలతో రూపొందింది. సాయి ప్రకాశ్ ఛాయాగ్రహణం పల్లెటూరి అందాలను చక్కగా చూపించింది. సింజిత్ యెర్రమల్లి అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరింతగా పండించాయి. తొలి చిత్రమే అయినప్పటికీ శ్రీకర్ నయన్ ఎంచుకున్న కథాంశం, దాన్ని తెరకెక్కించిన విధానం అభినందనీయం.
చివరిగా..
‘సమ్మర్ హాలిడేస్’ కేవలం వేసవి సెలవుల నేపథ్యంలో సాగే సినిమా మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరినీ తమ బాల్యంలోకి తీసుకెళ్లే ఓ మధురమైన అనుభూతి. బలమైన కథ, సహజమైన నటన, పల్లెటూరి అందాలు, స్నేహం, కుటుంబ భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన బలాలు. అక్కడక్కడా ఊహించదగిన కథనం ఉన్నప్పటికీ ప్రశాంతంగా, కుటుంబంతో కలిసి చూడదగిన చిత్రంగా నిలుస్తుంది.