బాణసంచా విక్రయాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి!

- – భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
- – జనావాసాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లోనే దుకాణాలు
- – రెండు దుకాణాల మధ్య కనీసం 15 మీటర్ల దూరం ఉండాలి
- – నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు: ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి, నవంబర్ 6 (సేనాని ప్రతినిధి): దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయాలు, నిల్వల విషయంలో వ్యాపారులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. బాణసంచా తయారీ కేంద్రాలు, నిల్వ గోదాములు, తాత్కాలిక విక్రయ దుకాణాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలును పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రమాదం కలగకుండా వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
బాణసంచా నిల్వ చేయడం, విక్రయాలు నిర్వహించేందుకు సంబంధిత శాఖల నుంచి ముందస్తుగా తాత్కాలిక అనుమతులు, లైసెన్సులు పొందడం తప్పనిసరని ఎస్పీ తెలిపారు. అధీకృత అనుమతులు కలిగిన టోకు వ్యాపారుల వద్ద నుంచే బాణసంచా కొనుగోలు చేయాలని సూచించారు. నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులకు దూరంగా పట్టణాలు, గ్రామాల శివార్లలోని ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రెండు దుకాణాల మధ్య కనీసం 15 మీటర్ల దూరం ఉండేలా చూడాలని, దుకాణాల నిర్మాణానికి అగ్నిని నిరోధించే ఆస్బెస్టాస్ లేదా ఇనుప రేకులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
ప్రతి బాణసంచా దుకాణం వద్ద అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. తగినంత నీరు, పొడి ఇసుక బస్తాలు, అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దుకాణాల వద్ద కొనుగోలుదారులు ఒకేసారి గుమిగూడకుండా క్రమపద్ధతిలో విక్రయాలు జరపాలని సూచించారు. ప్రమాద సూచనలు, భద్రతా జాగ్రత్తల వివరాలతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా రవాణా వాహనాల్లో లేదా ప్రయాణికులు ప్రయాణించే వాహనాల్లో బాణసంచా తరలించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
బాణసంచా నిల్వ గోదాముల్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన విద్యుత్ వైరింగ్ ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు అగ్ని హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండాలని తెలిపారు. లైసెన్సు గడువు ముగిసిన తర్వాత మిగిలిపోయిన బాణసంచాను ఇళ్లలో లేదా జనావాసాల్లో నిల్వ చేయడం నిషిద్ధమని పేర్కొన్నారు. మిగిలిన సరుకును తప్పనిసరిగా అధీకృత గోదాముల్లోనే భద్రపరచాలని వ్యాపారులకు సూచించారు.
అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేసినా, జనావాసాల్లో విక్రయాలు నిర్వహించినా, అగ్నిప్రమాద నివారణ చర్యలు పాటించకపోయినా బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తుహిన్ సిన్హా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పండుగ వేళ వ్యాపారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని తెలిపారు. వ్యాపారులు నిబంధనలను పాటించి, ప్రజలు కూడా భద్రతా సూచనలు అనుసరిస్తూ దీపావళి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు.