భారీ పెట్టుబడులకు కేబినెట్‌ పచ్చజెండా

భారీ పెట్టుబడులకు కేబినెట్‌ పచ్చజెండా

* ఐటీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ విధానాలకు ఆమోదం
* భీమిలిలో రూ.31,387 కోట్లతో ఏఐ డేటా కేంద్రం
* తిరుపతిలో డిక్సన్‌ సంస్థకు భూ కేటాయింపు
* కొత్త పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు

అమరావతి, నవంబర్‌ 10 (సేనాని ప్రతినిధి): రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ఈ భేటీలో 34 అజెండా అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. ఐటీ, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, సెమీకండక్టర్‌ రంగాలకు సంబంధించి మూడు కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నారు. విద్యుత్తు, హరిత ఇంధనం, పట్టణాభివృద్ధి, పోలీసు వ్యవస్థలోనూ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో డేటా కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు, పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులు ఈ సమావేశంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
2026–31 కాలానికి సంబంధించిన యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, విస్తరిత వాస్తవికత విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026–2036 రోబోటిక్స్‌, భౌతిక కృత్రిమ మేధ విధానానికీ పచ్చజెండా ఊపింది. సెమీకండక్టర్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ విధానం 4.0లో సవరణలకు అనుమతించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఈ-ప్యాక్‌ డేటా సెంటర్‌ సొల్యూషన్స్‌ సంస్థ మాడ్యులర్‌ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. రూ.570.20 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 2,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అదానీ క్లౌడ్‌ హబ్‌ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నివేదికను కూడా పరిశీలించింది.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో కార్బన్‌ కాస్మో సంస్థ రూ.4,000.20 కోట్ల పెట్టుబడితో ఎల్‌ఎఫ్‌పీ ప్రీకర్సర్‌, క్యాథోడ్‌ పదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమ ద్వారా 700 మందికి ఉపాధి లభించనుంది. తిరుపతిలో డిక్సన్‌ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది. దీని ద్వారా 2,300 ఉద్యోగాలు కల్పించనున్నారు. భీమిలిలో అమానం సంస్థ ఏర్పాటు చేయనున్న 512 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హరిత సమీకృత కృత్రిమ మేధ డేటా కేంద్రానికి ఆమోదం తెలిపింది. రూ.31,387 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. భోగాపురంలో రిలయన్స్‌ కృత్రిమ మేధ డేటా కేంద్రానికి భూముల బదలాయింపు ప్రతిపాదనకూ అనుమతి ఇచ్చింది. రావలి స్పిన్నర్స్‌ పరిశ్రమ విస్తరణకు రూ.236.92 కోట్ల పెట్టుబడితో అనుమతులు మంజూరు చేయగా, 1,569 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
విజయవాడలో రోజుకు 1,023 టన్నుల చెత్తను శుద్ధి చేస్తూ 15 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే వ్యర్థాల నుంచి విద్యుత్తు తయారీ కేంద్రానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం జెన్‌కోకు చెందిన 5.50 ఎకరాల భూమిని విజయవాడ నగరపాలక సంస్థకు ఉచితంగా బదలాయించనున్నారు. రాథీ గ్రీన్‌ ఎనర్జీ, న్యూల్యాండ్‌ ల్యాబ్స్‌ సంస్థలకు ప్రోత్సాహకాలు మంజూరు చేసే ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపింది. గ్రీన్‌కో సౌర విద్యుత్తు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 500 మెగావాట్ల నుంచి 1,500 మెగావాట్లకు పెంచేందుకు అనుమతించింది. రాష్ట్రంలో సంపీడిత జీవవాయువు కేంద్రాల ఏర్పాటుకూ పచ్చజెండా ఊపింది. చిన్న తరహా మాడ్యులర్‌ అణు రియాక్టర్ల సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అణు విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకుంది.
పోలీసు వ్యవస్థలో భాగంగా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ట్రాఫిక్‌ నిర్వహణ, రహదారి భద్రతా సంచాలక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డీజీపీ పరిధిలో పనిచేసే ఈ విభాగానికి ఐజీ స్థాయి అధికారి సంచాలకుడిగా వ్యవహరించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన సన్నిధి యాదవ, అదనపు సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేవాదాయ శాఖ శిల్ప విభాగంలో ప్రధాన స్థపతి పోస్టును మంజూరు చేసింది. సెంబ్‌కార్ప్‌ సంస్థకు సంబంధించిన రూ.48.73 కోట్ల ఏకకాల పరిష్కార ప్రతిపాదనను షరతులతో క్రమబద్ధీకరించింది. మొత్తంగా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, పరిపాలనా రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది.