బియ్యం విక్రయాల కోటా రెట్టింపు చేసిన కేంద్రం

హైదరాబాద్, నవంబరు 8 (సేనాని ప్రతినిధి): దీపావళి పండుగ వేళ సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు బహిరంగ మార్కెట్లో విక్రయించే బియ్యం కోటాను రెట్టింపు చేసింది. ఇప్పటివరకు 25 లక్షల టన్నులుగా ఉన్న లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచింది. ఇప్పటికే అక్టోబరు 31 నాటికి ఈ-వేలం విధానం ద్వారా 25 లక్షల టన్నుల బియ్యం విక్రయాలు పూర్తయ్యాయి.
మార్కెట్లో కృత్రిమ కొరత, అక్రమ నిల్వలను అరికట్టేందుకు కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బియ్యం, ధాన్యం నిల్వలు కలిగిన హోల్‌సేలర్లు, రిటైలర్లు, మిల్లర్లు, ఇతర వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని స్పష్టం చేసింది. ప్రతి శుక్రవారం ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో ఈ వివరాలను నమోదు చేసి నవీకరించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అత్యవసర వస్తువుల చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
దక్షిణ భారత రాష్ట్రాల్లో ‘భారత్ రైస్’ సరఫరాను పెంచేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నాఫెడ్, ఎన్సీసీఎఫ్ కేంద్ర గిడ్డంగులకు అదనపు బియ్యాన్ని కేటాయించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 2027 జనవరి 31 వరకు బియ్యం నిల్వలపై ప్రత్యేక పరిమితులు విధించేందుకు ఆమోదం తెలిపింది.
మార్కెట్లో బియ్యం అందుబాటును పెంచి, వినియోగదారులకు సరసమైన ధరలకు సరఫరా చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. నిల్వలపై పర్యవేక్షణ, బహిరంగ మార్కెట్లో అదనపు విక్రయాల ద్వారా ధరలను నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.