దక్షిణాది చిత్రాలపై రాధికా ఆప్టే వ్యాఖ్యలు!

హైదరాబాద్, నవంబరు 8 (సేనాని ప్రతినిధి): బాలీవుడ్ నటి రాధికా ఆప్టే దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై మరోసారి మాట్లాడారు. కీర్తి సురేశ్‌తో కలిసి నటించిన తాజా చిత్రం ‘అక్క’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. గతంలో ఓ సీనియర్ హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీయగా, తాజా వ్యాఖ్యలు కూడా సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
దక్షిణాది సినిమాల్లో పనిచేసినప్పుడు కొన్ని మంచి అనుభవాలు ఎదురైనా, మరికొన్ని సందర్భాలు మానసికంగా ఇబ్బంది పెట్టాయని రాధిక తెలిపారు. షూటింగ్‌ల కోసం కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు తనకు పరిచయస్తులు, స్నేహితులు ఎవరూ ఉండేవారు కాదని చెప్పారు. సరైన సహాయకులు లేకుండా ఒంటరిగా ఉండాల్సి వచ్చేదని వివరించారు. సెట్స్‌లో ఎక్కువగా పురుషులే ఉండేవారని, వారు మాట్లాడే భాష తనకు అర్థం కాకపోవడంతో ఒంటరితనానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని చిత్రాల విషయంలో ముందుగానే ఒప్పందాలు చేసుకునేవారు కాదని, స్క్రిప్ట్ కూడా అందించేవారు కాదని ఆమె ఆరోపించారు. షూటింగ్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అర్థంకాక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. అదే మరాఠీ సినిమాల్లో పనిచేసేటప్పుడు భాష తెలిసి ఉండటంతో పాటు, అవసరమైతే ఇంటికి వెళ్లే అవకాశం ఉండేదని గుర్తుచేసుకున్నారు. దక్షిణాది చిత్రాల షూటింగ్లలో మాత్రం తగిన సహకారం లేక ఇబ్బందిపడ్డానని తెలిపారు.
అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని రాధిక పేర్కొన్నారు. అప్పటి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తన హద్దులను స్పష్టంగా తెలియజేయడం, అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ప్రశ్నించడం అలవాటు చేసుకున్నానని చెప్పారు. తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘ధోని’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన రాధిక వ్యాఖ్యలు ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశంగా మారాయి.