‘డెమోంటే కాలనీ 3’ విడుదల తేదీ ఖరారు!

హైదరాబాద్, నవంబరు 9 (సేనాని ప్రతినిధి): తెలుగులోనూ మంచి ఆదరణ పొందిన తమిళ భయానక చిత్రాల పరంపర ‘డెమోంటే కాలనీ’. అజయ్ జ్ఞానముత్తు రచన, దర్శకత్వంలో ఇప్పటికే రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి మూడో భాగం సిద్ధమవుతోంది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథతో రూపొందుతున్న ‘డెమోంటే కాలనీ 3’ విడుదల తేదీపై చిత్రబృందం స్పష్టత ఇచ్చింది.
ఈ చిత్రంలో అరుల్ నిధి కథానాయకుడిగా నటిస్తుండగా, ప్రియా భవానీ శంకర్ కథానాయికగా కనిపించనున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను 2027 పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అర్చనా రవిచంద్రన్, మీనాక్షి గోవిందరాజన్తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
2015లో చిన్న చిత్రంగా విడుదలైన ‘డెమోంటే కాలనీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన రెండో భాగం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చనా రవిచంద్రన్ తదితరులు ఆ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు మూడో భాగంతో ఈ భయానక చిత్రాల పరంపర ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.