దేశంలో ఎల్పీజీ కనెక్షన్లు 32 కోట్లకు పైగా..

- – 2014లో 13 కోట్లుగా ఉన్న కనెక్షన్లు
- – ఉజ్వల పథకం కింద 10 కోట్లకు పైగా కనెక్షన్లు
- – ఎల్పీజీ పంపిణీదారులతో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి భేటీ
- – వంటగ్యాస్ సరఫరాకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 14 (భారత్ ప్రతినిధి): దేశంలో ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 2014లో సుమారు 13 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 32 కోట్లకు పైగా చేరిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఇందులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అందించిన కనెక్షన్లు 10 కోట్లకు మించి ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న పంపిణీదారులతో తన నివాసంలో సమావేశమైన సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు.ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో ఎల్పీజీ పంపిణీదారులతో మంత్రి మాట్లాడారు. వారి ఆలోచనలు, సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. దేశంలోని లక్షలాది కుటుంబాలకు వంటగ్యాస్ అందించడంలో పంపిణీదారులు, వారి సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇంధన రంగానికి సంబంధించిన సేవల్లో వినియోగదారులకు ముందుగా అందుబాటులో ఉండే వ్యవస్థగా ఎల్పీజీ పంపిణీ నెట్వర్క్ పనిచేస్తోందని పేర్కొన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధానాలను స్వీకరించేందుకు పంపిణీదారులు చూపుతున్న ఆసక్తిని మంత్రి ప్రశంసించారు. ప్రజలకు నిరంతర సేవలు అందించడంలో వారి నిబద్ధత అభినందనీయమని తెలిపారు. దేశ ఇంధన రంగంలో చోటుచేసుకుంటున్న మార్పుల్లో పంపిణీదారులు విలువైన భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఎల్పీజీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందిందని హర్దీప్ సింగ్ పూరి వివరించారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఎదురైనప్పటికీ దేశీయ వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ముఖ్యంగా పేద, వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ఇంధన కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇంధన అత్యవసర పరిస్థితులు, ధరల పెరుగుదలను ఎదుర్కొన్న సమయంలోనూ భారత్లో దేశీయ సరఫరాకు రక్షణ కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోని తక్కువ ధరల్లోనే భారత పౌరులకు ఇంధనం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎల్పీజీ పంపిణీదారులతో జరిగిన సమావేశంలో వారి సూచనలు, సమస్యలను తెలుసుకోవడం ద్వారా సేవలను మరింత మెరుగుపరిచే అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.