ధన త్రయోదశి వేళ పసిడి, వెండి ధరలకు భారీ పతనం!

ధన త్రయోదశి వేళ పసిడి, వెండి ధరలకు భారీ పతనం!

హైదరాబాద్‌, నవంబరు 6 (సేనాని ప్రతినిధి):
ఒక్కరోజే భారీగా తగ్గిన ధరలు ధన త్రయోదశి రోజున బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త. పసిడి, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. బహుళ వస్తు మారక వేదికలో బంగారం, వెండి భవిష్యత్‌ ఒప్పందాల ధరలు గణనీయంగా పడిపోయాయి. పది గ్రాముల బంగారం ధర రూ.2,451 తగ్గి రూ.1,41,644 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.3,782 తగ్గి రూ.1,83,358 వద్ద కొనసాగుతోంది.
క్రితం ముగింపుతో పోలిస్తే బంగారం ధర 1.70 శాతం, వెండి ధర 2.02 శాతం తగ్గడం గమనార్హం. పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన డిమాండ్‌లో మార్పులు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో ఈ తగ్గుదల కనిపించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.
నగరాల వారీగా బంగారం ధరలు
వివిధ నగరాల్లో పది గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,40,910గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,29,070గా ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్‌, కోల్‌కతా, పుణెల్లో 24 క్యారెట్ల ధర రూ.1,40,930గా, 22 క్యారెట్ల ధర రూ.1,29,090గా నమోదైంది. చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం రూ.1,41,250గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,29,390గా ఉంది.
వెండి ధరలూ దిగివచ్చాయ్‌
వెండి ధరలు కూడా నగరాలవారీగా స్వల్పంగా మారాయి. హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, జైపూర్‌, కోల్‌కతాలో కిలో వెండి ధర సుమారు రూ.1.82 లక్షలుగా ఉంది. ముంబై, బెంగళూరు, పుణెల్లో కిలో వెండి ధర రూ.1.81 లక్షలుగా నమోదైంది.
ధన త్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లు చేయాలని భావిస్తున్నవారు ధరల తగ్గుదలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే నగల దుకాణాల్లో కొనుగోలు చేసే సమయంలో తయారీ ఖర్చులు, పన్నులు, స్థానిక మార్కెట్‌ పరిస్థితుల కారణంగా తుది ధరల్లో తేడాలు ఉండవచ్చు.