డిసెంబర్‌ 18న అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్‌’ విడుదల!

డిసెంబర్‌ 18న అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్‌’ విడుదల!

హైదరాబాద్‌, నవంబరు 12 (సేనాని ప్రతినిధి): హాస్య నటుడు అల్లరి నరేశ్‌ మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ కామెడీ చిత్రం ‘ఆల్కహాల్‌’ డిసెంబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది.
గతేడాది విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో అల్లరి నరేశ్‌ మద్యానికి పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తిగా కనిపించనున్నారు. ప్రచార చిత్రంలో సత్య, నరేశ్‌ మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయించాయి. లక్షలు సంపాదిస్తున్నా మద్యం ఎందుకు తాగవని సత్య ప్రశ్నించగా.. సంపాదనకు, మద్యం తాగడానికి సంబంధమేంటని నరేశ్‌ ఎదురు ప్రశ్నిస్తారు. మద్యం తాగితే తనపై తనకు నియంత్రణ ఉండదని, అది తనను శాసించడం ఇష్టం లేదని చెబుతారు. చివర్లో సత్య మద్యం మానేశానని చెప్పగా.. తన స్నేహితులు తాగుతారని నరేశ్‌ బదులివ్వడం ఆకట్టుకుంది.
మెహర్‌ తేజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ, నిహారిక ఎన్‌ఎం, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిరీశ్‌ కులకర్ణి, హర్షవర్ధన్‌, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్‌, రఘుబాబు, వెంకటేశ్‌ కాకుమాను, కిరీటి, హరితేజ తదితరులు నటిస్తున్నారు. గిబ్రాన్‌ సంగీతం అందిస్తుండగా, చైతన్‌ భరద్వాజ్‌ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. జిజు సన్నీ ఛాయాగ్రహణం, నిరంజన్‌ దేవరమనే కూర్పు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది.