డిసెంబరు 4కు వాయిదా పడనుందా ‘మైసా’?

డిసెంబరు 4కు వాయిదా పడనుందా ‘మైసా’?

హైదరాబాద్‌, నవంబరు 13 (సేనాని ప్రతినిధి): టాలీవుడ్‌లో సినిమాల విడుదల వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు భారీ చిత్రాలు అనుకున్న తేదీలకు ప్రేక్షకుల ముందుకు రాలేకపోతుండగా, తాజాగా ఈ జాబితాలో రష్మిక మందన్న నటిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘మైసా’ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక తొలిసారిగా గిరిజన యువతి మైసా పాత్రలో కనిపించనున్నారు. తన జాతికి జరిగిన అన్యాయంపై పోరాడే యువతిగా ఆమె నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. డూప్‌ లేకుండా ప్రమాదకరమైన పోరాట సన్నివేశాల్లోనూ నటించినట్లు ఇటీవల విడుదలైన టీజర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. రావు రమేష్‌, సముద్రఖని, గురు సోమసుందరం, ఈశ్వరీ రావు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.
ముందుగా ఈ చిత్రాన్ని నవంబరు 27న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావడంతో విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నవంబరు 27కు బదులుగా డిసెంబరు 4న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటనలో ఉన్న రష్మిక.. తిరిగి వచ్చిన తర్వాత సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీ మార్పుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ‘మైసా’ వాయిదా వార్తలు ప్రచారంగానే చూడాలి.