‘దొంగ నా కొడుకు’ ట్రైలర్‌ అదుర్స్‌!

‘దొంగ నా కొడుకు’ ట్రైలర్‌ అదుర్స్‌!

హైదరాబాద్‌, నవంబరు 10 (సేనాని ప్రతినిధి): ‘లిటిల్‌ హార్ట్స్‌’ చిత్రంతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఈ సినిమా ప్రచార చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ చిత్రంలో మౌళి క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి, తల్లిదండ్రుల డబ్బును పోగొట్టే బాధ్యతలేని యువకుడిగా కనిపించనున్నారు. డబ్బుల కోసం కథానాయిక సుస్మితా శెట్టిని ఇబ్బంది పెట్టడం, ఆమె ఇచ్చిన బంగారు ఉంగరాలను సైతం తాకట్టు పెట్టే పరిస్థితులు ఎదురవడం వంటి సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. అప్పుల నుంచి బయటపడేందుకు, సులభంగా డబ్బు సంపాదించేందుకు అతడు చేసే ప్రయత్నాలు కథలో ఆసక్తిని పెంచుతున్నాయి.
అనుకోకుండా ఓ నగల దుకాణంలో దొంగతనానికి ప్రణాళిక వేయడం, ఆ ప్రయత్నం చివరకు ఎలాంటి గందరగోళానికి దారితీసిందన్నదే ఈ సినిమా ప్రధానాంశంగా తెలుస్తోంది. అలీ, రఘుబాబు, సుదర్శన్‌, రాజిత తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వినోదంతో పాటు నేర నేపథ్యాన్ని మేళవించిన ఈ చిత్రం నవంబరు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.