ఎండిన పత్తి పంటలు.. రైతుల గోడు!

ఎండిన పత్తి పంటలు.. రైతుల గోడు!
  • – ముఖరా (కే) వద్ద కేటీఆర్‌ను కలిసిన రైతులు
  • – పంట నష్టాలను ప్రత్యక్షంగా చూపించిన అన్నదాతలు
  • – కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ విమర్శలు
  • – ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్‌

ఆదిలాబాద్‌, నవంబర్ 1 (సేనాని ప్రతినిధి): ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న రైతు గర్జన సభకు వెళ్తున్న బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ముఖరా (కే) గ్రామానికి చెందిన నాయకులు, రైతులు కలిశారు. ముఖరా (కే) రహదారి వద్ద మాజీ సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌ రైతులతో కలిసి ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన పత్తి పంటలను కేటీఆర్‌కు చూపించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసినప్పటికీ ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు వివరించారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందకపోతే తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్నది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఏర్పడిన కరువని విమర్శించారు. రైతులకు ఇస్తామని చెప్పిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు సరఫరా చేయకుండా మోసం చేస్తున్నారని, సాగునీరు అందించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
రైతు భరోసా అందించకుండా, సాగుకు అవసరమైన నీటి వసతులు కల్పించకుండా అన్నదాతల జీవితాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎండిపోయిన పత్తి పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున, సోయా, ఇతర పంటలకు ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులకు న్యాయం చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ముఖరా (కే) గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా పోరాడతామని బీఆర్ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.