ఎన్నికల కౌంటింగ్‌ వేళ కఠిన ఆంక్షలు

ఎన్నికల కౌంటింగ్‌ వేళ కఠిన ఆంక్షలు
  • – అనకాపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో నిషేధాజ్ఞలు
  • – అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలకు వీల్లేదు
  • – బాణసంచా, అధిక శబ్దాలతో కూడిన సంగీతంపై నిషేధం
  • – నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్న డీఎస్పీ నరసింహారావు

అనకాపల్లి, నవంబర్ 6 (సేనాని ప్రతినిధి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అనకాపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. రెండో సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగియగా, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడంతో పాటు ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు వెల్లడించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీసు చట్టంలోని 30వ సెక్షన్‌, భారతీయ నాగరిక భద్రతా సంహితలోని 163వ సెక్షన్‌ ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని డీఎస్పీ స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు గుంపులుగా గుమిగూడరాదని సూచించారు. ఎన్నికల ఫలితాల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
పోలీసు శాఖ ముందస్తు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, ద్విచక్ర వాహన ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేదని హెచ్చరించారు. ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీలు, అభ్యర్థుల అనుచరులు వీధుల్లో సంబరాలు నిర్వహించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం నిషిద్ధమని పేర్కొన్నారు. రహదారులపై, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, అధిక శబ్దాలు చేసే సంగీత వ్యవస్థలను వినియోగించడంపైనా నిషేధం విధించినట్లు వివరించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే సందేశాలు, ఇతర పార్టీలను కించపరిచే పోస్టులు పెట్టవద్దని డీఎస్పీ హెచ్చరించారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర వేదికలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై సైబర్‌ నేరాల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్‌ ప్రక్రియ మాదిరిగానే ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళి, పోలీసు ఆంక్షలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.