ఏపీలో ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం: లోకేశ్

ఏపీలో ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం: లోకేశ్
  • – రాష్ట్రంలో 25 పారిశ్రామిక వ్యవస్థల అభివృద్ధికి ప్రణాళిక
  • – స్టార్టప్‌లకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం
  • – 31 స్టార్టప్‌లకు రూ.2.11 కోట్ల తొలి విడత
  • – ఆర్థికసాయం ఆరుగురు ప్రతిభావంతులైన స్టార్టప్ నిర్వాహకులకు సత్కారం

విశాఖపట్నం, నవంబర్ 13 (భారత్ ప్రతినిధి): ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు 25 పారిశ్రామిక వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రతన్ టాటా ఆవిష్కరణల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అంకుర సంస్థల మార్పిడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ఆరుగురు అంకుర సంస్థల నిర్వాహకులను లోకేశ్ అభినందించారు. ప్రత్యేక జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. నూతన ఆలోచనలతో సంస్థలను ప్రారంభించి, తమ ప్రతిభను చాటుకుంటున్న యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. అంకుర సంస్థలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంకుర సంస్థలు, ఆవిష్కరణల విధానం-2024 కింద రాష్ట్రంలో తొలిసారిగా 31 అంకుర సంస్థలకు తొలి విడతగా రూ.2.11 కోట్ల ఆర్థికసాయం అందజేశారు. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ఆయా సంస్థల ప్రతినిధులకు ఆర్థికసాయానికి సంబంధించిన అనుమతి పత్రాలు, చెక్కులను పంపిణీ చేశారు. కొత్త ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా మార్చుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు యువతలో వ్యాపార ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని లోకేశ్ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదిగేలా అవకాశాలు కల్పించాలన్నదే లక్ష్యమని చెప్పారు. అంకుర సంస్థల నిర్వాహకులు తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంకుర సంస్థల ప్రతినిధులు గొప్ప విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి గర్వకారణంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో 25 పారిశ్రామిక వ్యవస్థల అభివృద్ధి, అంకుర సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహం, అవసరమైన సహకారం అందించడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అంకుర సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.