ఏపీలో రూ.36 వేల కోట్ల పెట్టుబడులకు క్లీన్‌మాక్స్‌ ఆసక్తి

ఏపీలో రూ.36 వేల కోట్ల పెట్టుబడులకు క్లీన్‌మాక్స్‌ ఆసక్తి
  • * సమగ్ర ఇంధన, విద్యుత్‌ ప్రాజెక్టులకు సంస్థ అంగీకారం
  • * 4 గిగావాట్ల పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు
  • * డేటా సెంటర్‌ పార్క్‌కు రూ.2 వేల కోట్లు
  • * పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్ల పెట్టుబడి

విశాఖపట్నం, నవంబర్‌ 12 (సేనాని ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు క్లీన్‌మాక్స్‌ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సమగ్ర పునరుత్పాదక ఇంధనం, విద్యుత్‌ పంపిణీ, పంప్డ్‌ స్టోరేజ్‌, డేటా సెంటర్‌ పార్క్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌తో క్లీన్‌మాక్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుల్‌దీప్‌ జైన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో చేపట్టనున్న పెట్టుబడులు, ప్రాజెక్టులపై చర్చించారు.
సంస్థ ప్రతిపాదనల ప్రకారం 4 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.28 వేల కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో 3 గిగావాట్ల పవన విద్యుత్‌, ఒక గిగావాట్‌ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ఉంటాయి. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులు సమృద్ధిగా ఉన్న రెండో శ్రేణి నగరంలో సొంత విద్యుత్‌ పంపిణీ వ్యవస్థతో ఒక గిగావాట్‌ ఐటీ విద్యుత్‌ లోడ్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.2 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కుల్‌దీప్‌ జైన్‌ వెల్లడించారు.
అదేవిధంగా ఒక గిగావాట్‌ సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రూ.6 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు విద్యుత్‌ నిల్వ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి. పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిని విద్యుత్‌ నిల్వ వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు వీలవుతుందని సంస్థ ప్రతిపాదనల్లో వివరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లె, పరిసర గ్రామాల్లో ఇప్పటికే తమ సంస్థ ఆధ్వర్యంలో 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్‌ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని కుల్‌దీప్‌ జైన్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో 2029 నాటికి 25 గిగావాట్‌ గంటల బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల సామర్థ్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. క్లీన్‌మాక్స్‌ సంస్థ చేపట్టనున్న పవన, సౌర విద్యుత్‌ సమ్మిళిత ప్రాజెక్టుల్లో బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థలను కూడా అనుసంధానం చేయాలని కోరారు. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, విద్యుత్‌ నిల్వ సదుపాయాలను విస్తరించడం, డేటా కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు జరిగాయి.