గిగ్ కార్మికుల సంక్షేమానికి కేంద్రం కీలక నిర్ణయం

హైదరాబాద్, అక్టోబరు 30 (సేనాని ప్రతినిధి): దేశంలో వేగంగా విస్తరిస్తున్న గిగ్ ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డెలివరీ భాగస్వాములు, ఇతర డిజిటల్ వేదికల కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ రంగాలతో పాటు డిజిటల్ వేదికలపై పనిచేసే కార్మికులను సంక్షేమ పరిధిలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.
కేంద్ర మంత్రి అధ్యక్షతన బోర్డు
ఈ ఉన్నతస్థాయి బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు కంపెనీల యజమానులు, సంబంధిత వర్గాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన సంక్షేమ పథకాలను రూపొందించడం బోర్డు ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
సామాజిక భద్రతా చట్టాల అమలును పర్యవేక్షించడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయనుంది. వివిధ రంగాల కార్మికుల నుంచి అభిప్రాయాలు సేకరించి, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలు, నిబంధనలను పరిశీలించనుంది. అన్ని వర్గాల కార్మికులకు సమానమైన సంక్షేమ ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టనుంది.
ఏడాదికి మూడుసార్లు సమావేశాలు
కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల అమలును సమీక్షించేందుకు ఈ బోర్డు ఏడాదికి కనీసం మూడుసార్లు సమావేశం కానుంది. రాష్ట్రాల వారీగా కార్మికుల నమోదు వివరాలు, సంక్షేమ పథకాల పురోగతిని పరిశీలించనుంది. అలాగే ప్రభుత్వం కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చవుతున్నాయా లేదా అన్న అంశంపైనా దృష్టి సారించనుంది.
అర్హులకు నేరుగా ప్రయోజనాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన డెలివరీ భాగస్వాములు, ఇతర గిగ్ కార్మికులకు సహాయం అందేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పారదర్శక విధానాలను అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ఈ బోర్డు ఏర్పాటు ద్వారా డిజిటల్ రంగంలో పనిచేస్తున్న వారికి సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు అందించే మార్గం సుగమం కానుంది. కార్మికుల కుటుంబాలకు కూడా భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించేలా ప్రత్యేక నిబంధనలు రూపొందించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయోజనాలు ఎప్పటి నుంచి, ఏ విధంగా అమలవుతాయనే అంశాలపై అధికారిక మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.