గిగ్‌ కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి వివేక్‌ వెంకటస్వామి

గిగ్‌ కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి వివేక్‌ వెంకటస్వామి

* కొండాపూర్‌లోని యూపీజెడ్‌ హబ్‌లో ఆత్మీయ సమావేశం
* కార్మికుల పని పరిస్థితులు, సమస్యలపై ఆరా
* డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో గిగ్‌ వర్కర్ల పాత్ర కీలకం
* సంక్షేమం, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యం

హైదరాబాద్‌, నవంబర్‌ 12 (సేనాని ప్రతినిధి): గిగ్‌ కార్మికుల పని పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మంత్రి వివేక్‌ వెంకటస్వామి వారితో కలిసి భోజనం చేశారు. కొండాపూర్‌లోని యూపీజెడ్‌ హబ్‌లో గిగ్‌ వర్కర్లతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి రోజువారీ విధులు, పని సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వారి జీవన ప్రయాణం గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో గిగ్‌ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎండ, వాన, రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రజలకు వివిధ సేవలు అందిస్తున్న వారి శ్రమ ఎంతో విలువైనదని అన్నారు. ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడంలో వారు అందిస్తున్న సేవలను గుర్తించాలని తెలిపారు.
అయితే గిగ్‌ కార్మికుల శ్రమకు తగిన గుర్తింపుతో పాటు గౌరవం, భద్రత, సామాజిక భరోసా కూడా అవసరమని వివేక్‌ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. పని పరిస్థితులు మెరుగుపడటంతో పాటు వారి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలకు భద్రత కల్పించే చర్యలు ఉండాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.
కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, మెరుగైన పని పరిస్థితుల కల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి కార్మికుడి శ్రమకు తగిన గౌరవం దక్కాలని, వారి కుటుంబాలకు భద్రతతో కూడిన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గిగ్‌ కార్మికులతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలు, సమస్యలను తెలుసుకోవడం ద్వారా వారి అవసరాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం లభించిందని మంత్రి పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడటం, వారి సంక్షేమానికి తోడ్పడటం ప్రభుత్వ బాధ్యతగా అభివర్ణించారు.