గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా..అమల్లోకి కొత్త చట్టం

- – గిగ్ వర్కర్ల సంక్షేమ విధానం ఆవిష్కరణ
- రాహుల్ గాంధీతో కలిసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- – రూ.10 లక్షల ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటన
- – ప్రత్యేక గుర్తింపు కార్డులు, సంక్షేమ బోర్డు ఏర్పాటు
హైదరాబాద్, నవంబర్ 14 (భారత్ ప్రతినిధి): తెలంగాణలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూపొందించిన నూతన విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని జయభేరీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల నమోదుకు సంబంధించిన ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన చట్టాన్ని కార్మికులకు అంకితం చేశారు. కార్యక్రమం ప్రారంభంలో నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అంతకుముందు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గిగ్ వర్కర్ల ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ వారితో కలిసి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
నెహ్రూ జయంతి సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల చట్టాన్ని ప్రజలకు అంకితం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ చట్టం అదే రోజు నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దీని ద్వారా ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆరోగ్య భద్రతలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కార్మికుడికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించనున్నట్లు చెప్పారు. ఈ విధానం ద్వారా గిగ్, ప్లాట్‌ఫామ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను గుర్తించి వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గిగ్ వర్కర్ల కోసం చట్టం రూపొందించే ప్రక్రియలో ఐఐటీ వంటి విద్యాసంస్థలతో పాటు సామాజిక కార్యకర్త నిఖిల్ సహకారం అందించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారు ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని చెప్పారు. గిగ్ వర్కర్ల నాయకులు, వివిధ రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కార్మికుల అవసరాలకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు. విధుల్లో ఉండగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిగ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు పాల్గొన్నారు.