గొడవల్లో నష్టపోయేది కార్యకర్తలే!

గొడవల్లో నష్టపోయేది కార్యకర్తలే!
  • – నాయకులకు ఏమీ కాదు.. కార్యకర్తలే బలవుతున్నారు
  • – అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి
  • – నష్టపోయిన వారికి అండగా ఉంటా ఫ్యాక్షనిజం లేని తాడిపత్రే నా ఆకాంక్ష

తాడిపత్రి, నవంబర్ 5 (సేనాని ప్రతినిధి): రాజకీయ గొడవలు, వర్గ విభేదాల వల్ల చివరకు నష్టపోయేది క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలేనని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నాయకులుగా ఉన్న తమలాంటి వారు ఎప్పుడూ బాగానే ఉంటారని, వివాదాలు, ఘర్షణల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనేది మాత్రం సామాన్య కార్యకర్తలేనని అన్నారు. నాయకుల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వాటిని కార్యకర్తలు వ్యక్తిగత గొడవలుగా మార్చుకోవద్దని సూచించారు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబాలు, భవిష్యత్తుపై దృష్టి సారించాలని హితవు పలికారు. తాడిపత్రిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారంలో యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో చోటుచేసుకున్న సంఘటనలను ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రస్తావించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల వల్ల రాజకీయంగా ఎవరికి ప్రయోజనం కలగలేదని, నష్టపోయింది మాత్రం కిందిస్థాయి కార్యకర్తలేనని పేర్కొన్నారు. నాయకుల మాటలు, రాజకీయ పరిణామాల ప్రభావంతో కార్యకర్తలు గొడవలకు దిగడం వల్ల చివరకు వారి కుటుంబాలే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రాజకీయాల కోసం తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, ఏ సమస్య ఎదురైనా సంయమనం పాటిస్తూ చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇటీవల జరిగిన ఘర్షణల్లో నష్టపోయిన కార్యకర్తలకు ఎన్నికలు ముగిసిన తర్వాత తన వంతుగా చేతనైన సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలను విస్మరించబోనని, ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అయితే కార్యకర్తలు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని కోరారు. తాత్కాలిక రాజకీయ ఆవేశాలకు లోనై కేసులు, గొడవలు, ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకోవడం వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు.
ముఖ్యంగా యల్లనూరు, పుట్లూరు మండలాల్లో జరిగిన ఘటనలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయా సంఘటనల్లో నష్టపోయిన వారికి క్షమాపణలు తెలిపారు. రాజకీయ విభేదాలు ప్రజల మధ్య శత్రుత్వాలకు దారితీయకూడదని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో ఫ్యాక్షన్‌ రాజకీయాల కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యకర్తల మధ్య సఖ్యత పెరగాలని, వ్యక్తిగత కక్షలకు రాజకీయాలను వేదికగా మార్చుకోవద్దని స్పష్టం చేశారు.
యల్లనూరు, పుట్లూరు ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం పూర్తిగా నశించి, ఆ మండలాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు ప్రశాంత జీవనం, యువతకు మెరుగైన భవిష్యత్తు, గ్రామాలకు అభివృద్ధి అందాలంటే ఘర్షణలకు స్వస్తి పలకాలని అన్నారు. రాజకీయ నాయకులు సైతం కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. పదవులు, రాజకీయ ఆధిపత్యం కంటే ప్రజల సంక్షేమం, కార్యకర్తల భద్రత ముఖ్యమని ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.