గుడ్లు, చికెన్ ధరలకు రెక్కలు!

హైదరాబాద్, నవంబరు 9 (సేనాని ప్రతినిధి): ప్రోటీన్ కోసం నిత్యం గుడ్లు, చికెన్ తీసుకునేవారికి రానున్న రోజుల్లో అదనపు భారం తప్పేలా లేదు. కోళ్ల మేత ధరలు భారీగా పెరుగుతుండటంతో గుడ్లు, చికెన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026 డిసెంబరు నాటికి వీటి ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరగవచ్చని చెబుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఇది మరింత భారంగా మారనుంది. కోళ్లకు అందించే మేత తయారీలో ఉపయోగించే మొక్కజొన్న, నూకల ధరలు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
మొక్కజొన్న, నూకల ధరలకు రెక్కలు
కోళ్ల మేత తయారీలో మొక్కజొన్న కీలక పాత్ర పోషిస్తుంది. బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చే మేతలో బరువు ప్రకారం సుమారు 55 నుంచి 65 శాతం వరకు మొక్కజొన్నే ఉంటుంది. గత ఏడాది కిలో మొక్కజొన్న ధర రూ.18 ఉండగా.. ప్రస్తుతం రూ.34కు చేరింది. డిసెంబరు నాటికి ఇది రూ.40కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక నూకల ధరలు కూడా భారీగా పెరిగాయి. గత ఏడాది కిలో రూ.14 నుంచి రూ.15 మధ్య ఉన్న ధర.. ప్రస్తుతం రూ.31 నుంచి రూ.32కు చేరింది. నెల రోజుల క్రితం రూ.22 నుంచి రూ.23గా ఉన్న నూకల ధరలు కూడా వేగంగా పెరిగాయి.
తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్
మొక్కజొన్న, నూకల ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం కారణంగా మొక్కజొన్న ఉత్పత్తి తగ్గినట్లు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఖరీఫ్ మొక్కజొన్న ఉత్పత్తి 15 నుంచి 16 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. మరోవైపు ఇథనాల్ తయారీలోనూ మొక్కజొన్నను ఎక్కువగా వినియోగిస్తుండటంతో పౌల్ట్రీ మేత తయారీ సంస్థలకు దాని లభ్యత తగ్గుతోంది.
పౌల్ట్రీ రంగంపై పెరుగుతున్న భారం
ధాన్యాన్ని నిల్వ చేయడం కూడా మార్కెట్‌లో సరఫరాపై ప్రభావం చూపుతోంది. బలహీనమైన రుతుపవనాల కారణంగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉండటంతో నూకల ధరలు సైతం పెరుగుతున్నాయి. మేత తయారీకి అయ్యే ఖర్చు పెరగడంతో కోళ్ల పెంపకం వ్యయం కూడా అధికమవుతోంది. ఈ పరిస్థితులు కొనసాగితే పౌల్ట్రీ వ్యాపారులు ఆ భారాన్ని గుడ్లు, చికెన్ ధరల రూపంలో వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. డిసెంబరు నాటికి ధరలు ఎంతమేర పెరుగుతాయన్నది మొక్కజొన్న, నూకల సరఫరా, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.