హైదరాబాద్‌లోకి గ్రీన్‌ ఎస్‌ఎం క్యాబ్‌లు.. కిలోమీటర్‌ రూ.9

హైదరాబాద్‌లోకి గ్రీన్‌ ఎస్‌ఎం క్యాబ్‌లు.. కిలోమీటర్‌ రూ.9

హైదరాబాద్‌, నవంబరు 14 (భారత్ ప్రతినిధి): హైదరాబాద్‌ రవాణా రంగంలోకి మరో కొత్త సంస్థ ప్రవేశించింది. వియత్నాంకు చెందిన గ్రీన్‌ ఎస్‌ఎం ఎలక్ట్రిక్‌ క్యాబ్‌ సేవలు నగరంలో ప్రారంభమయ్యాయి. కిలోమీటరుకు రూ.9 ప్రారంభ ధరతో ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. దీంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఓలా, ఉబర్‌, రాపిడో సంస్థలకు, స్థానిక ఆటో డ్రైవర్లకు కొత్త పోటీ ఎదురుకానుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇదే తరహా ధరలతో సేవలు అందిస్తున్న సంస్థ తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
గ్రీన్‌ ఎస్‌ఎం వెనుక వియత్నాంకు చెందిన వ్యాపారవేత్త ఫామ్‌ నట్‌ వాంగ్‌ ఉన్నారు. ఆయనకు చెందిన విన్‌గ్రూప్‌ సంస్థ అనుబంధ విభాగమైన విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తోంది. ఈ వాహనాలను క్యాబ్‌ సేవలకు వినియోగించేందుకు గ్రీన్‌ ఎస్‌ఎం సంస్థను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వి-గ్రీన్‌ పేరుతో విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ కేంద్రాల నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో ఇది కేవలం క్యాబ్‌ సేవలకే పరిమితం కాకుండా సమగ్ర విద్యుత్‌ రవాణా వ్యవస్థగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది.
ఇతర క్యాబ్‌ సంస్థలతో పోలిస్తే గ్రీన్‌ ఎస్‌ఎం వ్యాపార విధానం భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్‌ వంటి సంస్థలు సొంత వాహనాలున్న డ్రైవర్లను భాగస్వాములుగా చేర్చుకుంటాయి. కానీ గ్రీన్‌ ఎస్‌ఎం మాత్రం సొంతంగా వాహనాలను నిర్వహిస్తూ డ్రైవర్లను నేరుగా ఉద్యోగులుగా నియమించుకుంటోంది. వారికి నెలకు సుమారు రూ.30 వేల స్థిర వేతనం చెల్లిస్తున్నట్లు సమాచారం. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుందని, అదనపు కిలోమీటర్లకు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే వాహనాలకు నష్టం జరిగితే డ్రైవర్‌ తప్పిదం ఉన్న సందర్భాల్లో జీతం నుంచి మొత్తాన్ని మినహాయించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తక్కువ ధరలకు సేవలు అందించేందుకు సంస్థకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. సొంతంగా కార్ల తయారీ, వాహనాల నిర్వహణ, ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంది. సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే విద్యుత్‌ కార్ల నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో మూడు డిపోల నుంచి సుమారు 3,500 నుంచి 3,600 వాహనాలతో కార్యకలాపాలు ప్రారంభించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఇదే వ్యాపార నమూనాను బెంగళూరు, ఢిల్లీ నగరాల్లోనూ విస్తరించాలని సంస్థ భావిస్తోంది.
2022 డిసెంబరులో తెలంగాణ ప్రభుత్వం విన్‌గ్రూప్‌తో రూ.25 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల విస్తరణకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. మరోవైపు తక్కువ ధరలతో పోటీ సంస్థలను మార్కెట్‌ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తమ ధరలు నిర్వహణ ఖర్చులకు అనుగుణంగానే ఉన్నాయని, లాభదాయకంగానే సేవలు అందిస్తున్నామని గ్రీన్‌ ఎస్‌ఎం నిరూపించగలిగితే ఈ విధానానికి చట్టపరమైన ఇబ్బందులు ఉండకపోవచ్చు.
గ్రీన్‌ ఎస్‌ఎం ప్రవేశంతో ప్రయాణికులకు తక్కువ ధరల్లో క్యాబ్‌ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పోటీ పెరగడంతో ఇతర సంస్థలు కూడా ధరలు తగ్గించడంతో పాటు సేవల నాణ్యతను మెరుగుపరిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తక్కువ ఆదాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు ఈ పరిణామం సవాలుగా మారనుంది. ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణం, బైక్‌ టాక్సీలు, ఇతర క్యాబ్‌ సంస్థల పోటీకి తోడు కొత్త సంస్థ రాకతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ రవాణా రంగంలో ఈ కొత్త పోటీ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.