హిందూ కళాశాలను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదు

- – విద్యార్థుల ఆందోళనకు కల్వకుంట్ల కవిత సంఘీభావం
- – కేంద్రం స్పందించకుంటే ఉద్యమం ఉద్ధృతం
- – చారిత్రక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
న్యూఢిల్లీ, నవంబర్ 4 (సేనాని ప్రతినిధి): ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రతిష్ఠాత్మక హిందూ కళాశాలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను సహించబోమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కళాశాల ప్రత్యేక వారసత్వాన్ని, గుర్తింపును కాపాడాలంటూ గత నెలన్నర రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నిర్వహిస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని హిందూ కళాశాలకు వెళ్లి నిరసన చేస్తున్న విద్యార్థులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థ ఎంతోమంది మేధావులను దేశానికి అందించిందని, దాని ప్రత్యేకతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు.
ప్రైవేటు సంస్థలు కళాశాల నిర్వహణకు నిధులు సమకూరుస్తున్నాయనే కారణంతో దాని నిర్వహణ బాధ్యతలను పూర్తిగా వాటికి అప్పగించాలని చూడటం సరికాదని కవిత అన్నారు. నిధుల సాయాన్ని అందించడం వేరు, విద్యాసంస్థపై యాజమాన్య హక్కులు కల్పించడం వేరని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల మంజూరు సంఘం నిబంధనల ప్రకారం విరాళాలు అందించే ప్రైవేటు సంస్థలకు పరిమితమైన సౌకర్యాలు మాత్రమే కల్పించాలని సూచించారు. నిధుల పేరుతో చారిత్రక కళాశాలను ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల స్వతంత్రత, విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నెలన్నరగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కవిత ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కళాశాల ప్రవేశాల ప్రక్రియలో జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్న అవకతవకలు, కళాశాలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలపై వారు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇంతకాలంగా నిరసనలు కొనసాగుతున్నా సంబంధిత వర్గాలు మౌనంగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
విద్యార్థుల గొంతును అణచివేయాలని ప్రయత్నిస్తే ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని కవిత అన్నారు. న్యాయబద్ధమైన ప్రతి పోరాటానికీ తాను మద్దతుగా నిలుస్తానని, హిందూ కళాశాల విద్యార్థులు చేస్తున్న ఉద్యమం సమంజసమైనదని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల పరిరక్షణ కోసం విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి ఆందోళనలను కేవలం నిరసనలుగా చూడకుండా, వాటి వెనుక ఉన్న సమస్యలను అర్థం చేసుకోవాలని కేంద్రానికి సూచించారు. విద్యార్థుల ఆవేదనను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
హిందూ కళాశాల చారిత్రక ప్రాధాన్యతను, విద్యా రంగానికి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని దాని ప్రత్యేక గుర్తింపును కాపాడాలని కవిత కేంద్రాన్ని కోరారు. విద్యార్థులు, అధ్యాపకులు లేవనెత్తిన అంశాలపై తక్షణమే స్పందించి, ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే విద్యార్థుల ఉద్యమానికి మరింత విస్తృతంగా మద్దతు తెలుపుతామని, ఆందోళనను ఉద్ధృతం చేసే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. విద్యార్థుల హక్కులు, విద్యాసంస్థల పరిరక్షణ కోసం తాము అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేశారు.