హువాంగ్‌ను నియమించుకోవడం గౌరవంగా భావిస్తా: మస్క్‌

హువాంగ్‌ను నియమించుకోవడం గౌరవంగా భావిస్తా: మస్క్‌

న్యూఢిల్లీ, నవంబరు 12 (సేనాని ప్రతినిధి): ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ను తన సంస్థలో నియమించుకునే అవకాశం వస్తే గౌరవంగా భావిస్తానని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. హువాంగ్‌ను ఉద్యోగంలోకి తీసుకోవాలని ఓ నెటిజన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన సూచనకు మస్క్‌ స్పందిస్తూ.. ‘‘అది నాకు గౌరవంగా ఉంటుంది’’ అని బదులిచ్చారు.
ఈ నెల ప్రారంభంలోనూ మస్క్‌ హువాంగ్‌కు మద్దతుగా నిలిచారు. సీక్వోయా క్యాపిటల్‌ భాగస్వామి షాన్‌ మాగ్వైర్‌ చేసిన ఓ పోస్టును సమర్థించారు. ఈ తరానికి చెందిన గొప్ప వ్యాపారవేత్తల్లో హువాంగ్‌ ఒకరని మాగ్వైర్‌ ప్రశంసించారు. అయితే ఆయన ఓ తీవ్రమైన తప్పు చేశారని, అది అమెరికాకు నష్టదాయకమని అభిప్రాయపడ్డారు. హువాంగ్‌ చర్యల వెనుక దురుద్దేశం ఉండకపోవచ్చని, అమెరికా కృత్రిమ మేధ రంగానికి ఆయనలాంటి నాయకుడు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
మరోవైపు, హువాంగ్‌ వ్యక్తిగత వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలు ఎన్విడియాలో కలకలం రేపుతున్నాయి. ఆయనను సీఈవో పదవిలో కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై కంపెనీ బోర్డు చర్చిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో హువాంగ్‌ వివాహేతర సంబంధాన్ని అంగీకరించినట్లు, దీంతో బోర్డు స్వతంత్ర విచారణ చేపట్టినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి.
ఎన్విడియా వైస్‌ ప్రెసిడెంట్‌ కింబర్లీ పావెల్‌తో హువాంగ్‌కు సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతకుముందు చైనా అధికారిణిగా పనిచేసిన ఆలిస్‌ హువాంగ్‌ (హువాంగ్‌ లీ)తోనూ ఆయనకు సంబంధం ఉందని, ఆమె చైనా గూఢచారి అయి ఉండొచ్చని అమెరికా నిఘా సంస్థలు భావిస్తున్నట్లు కొన్ని కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత లేదు.
ఈ పరిణామాల ప్రభావం ఎన్విడియా షేర్లపై పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. న్యూయార్క్‌ మార్కెట్‌లో బుధవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత జరిగిన లావాదేవీల్లో కంపెనీ షేర్లు ఒక దశలో 10 శాతం వరకు పడిపోయాయి. ఐదు రోజుల వ్యవధిలో 13 శాతం నష్టపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కంపెనీ మార్కెట్‌ విలువ 4 లక్షల కోట్ల డాలర్ల దిగువకు చేరే అవకాశం ఉందని కథనాలు పేర్కొన్నాయి.