ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: రాహుల్ గాంధీ

- – గిగ్ కార్మికుల కష్టాలు, సమస్యలు నాకు తెలుసు
- – కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
- – విశ్రాంతి కేంద్రాలు, బీమా, పింఛను సదుపాయాలు
- – ప్రతి డెలివరీపై ఒక శాతం నిధులు కార్మికుల ఖాతాలకు
హైదరాబాద్, నవంబర్ 14 (భారత్ ప్రతినిధి): గిగ్ కార్మికుల సమస్యలు, వారి కష్టాలు తనకు తెలుసని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కార్మికుల శ్రమను గుర్తించి వారికి అండగా నిలుస్తామని గతంలో తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. గిగ్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వారిని ఆప్యాయంగా పలుకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల కష్టాలను గుర్తించడమే కాకుండా, వారి జీవితాల్లో భద్రత, గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.
దేశంలో ఇప్పటివరకు గిగ్ కార్మికులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒక డెలివరీకి ఎంత సమయం పడుతోంది, దానికి కార్మికుడికి ఎంత పారితోషికం లభిస్తోంది అనే వివరాలు కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి ఉందన్నారు. పని చేస్తున్నది కార్మికులే అయినప్పటికీ, వారి శ్రమకు సంబంధించిన సమాచారం వారి చేతుల్లో ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి డెలివరీకి సంబంధించిన వివరాలను కార్మికులకు తెలియజేస్తోందని చెప్పారు. వారి శ్రమకు తగిన గుర్తింపు, పారితోషికం అందేలా చర్యలు చేపడుతోందని వివరించారు.
ఎండలోనూ, వర్షంలోనూ నగరాల వీధుల్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ డెలివరీలు చేసే కార్మికులకు విశ్రాంతి తీసుకునేందుకు గతంలో తగిన వసతులు లేవని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర నగరాల్లో ప్రభుత్వం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. గిగ్ కార్మికులకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య సహాయం, ప్రమాదాల సమయంలో బీమా రక్షణ కల్పించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.5 లక్షలు, రూ.10 లక్షల ప్రమాద బీమా సదుపాయాలతో పాటు పింఛను, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
ప్రతి డెలివరీ, ప్రతి రవాణా లావాదేవీకి సంబంధించిన మొత్తంలో ఒక శాతం నిధులు గిగ్ కార్మికుల సంక్షేమ బోర్డుకు చేరే విధానం అమలు చేస్తున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆ నిధులు బోర్డు ద్వారా కార్మికుల ఖాతాలకు చేరుతాయని చెప్పారు. కార్మికులకు ప్రతి డెలివరీలో వాటా లభించడంతో పాటు విశ్రాంతి, ఆరోగ్య రక్షణ, కుటుంబ సంక్షేమానికి అవసరమైన సదుపాయాలు అందాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. కార్మికుల హక్కులు, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
దేశంలో కార్మికుల విషయంలో రెండు భిన్నమైన ఆలోచనా విధానాలు ఉన్నాయని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానం కార్మికులతో ఎక్కువ సమయం పనిచేయించుకుని వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకుండా చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ విధానం మాత్రం గిగ్ కార్మికులను దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా గుర్తించి, వారికి రక్షణ కల్పించడమేనని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం గిగ్ కార్మికులకు అండగా ఉంటాయని, వారి పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య భద్రతకు తోడ్పాటు అందిస్తాయని భరోసా ఇచ్చారు. కార్మికులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ జై హింద్, జై తెలంగాణ నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు.