ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా..జాన్వీ కపూర్!

ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా..జాన్వీ కపూర్!

హైదరాబాద్‌, నవంబరు 9 (సేనాని ప్రతినిధి): బాలీవుడ్‌ కథానాయిక, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లోకి రాకముందు తల్లి శ్రీదేవి పెట్టిన షరతులు, ఇచ్చిన సలహాలతో పాటు తన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట ఆ విషయాన్ని తల్లికి చెప్పానని జాన్వీ గుర్తుచేసుకున్నారు. అయితే శ్రీదేవి వెంటనే తన నిర్ణయానికి అంగీకరించలేదని తెలిపారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టడం సాధారణ విషయం కాదని, ఈ వృత్తిని ఎంచుకుంటే జీవితాంతం నటనకే అంకితం కావాల్సి ఉంటుందని తల్లి చెప్పినట్లు వెల్లడించారు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, పూర్తి నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుందని శ్రీదేవి వివరించినట్లు పేర్కొన్నారు. తొలినాళ్లలో తనపై తల్లికి అంతగా నమ్మకం ఉండేది కాదని జాన్వీ తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో సినిమాల్లోకి రాకముందే తన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు జాన్వీ వెల్లడించారు. తల్లి సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆ తర్వాతే తనలో నటిగా కొనసాగగల లక్షణాలు ఉన్నాయని శ్రీదేవి భావించినట్లు వివరించారు. ఈ వ్యాఖ్యలతో జాన్వీ సినీ రంగ ప్రవేశానికి ముందు చేసిన మార్పులపై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది.
అందం విషయంలోనూ జాన్వీ గతంలో పలుమార్లు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇతరులతో పోల్చుకోవడం సరికాదని, సామాజిక మాధ్యమాల్లో కనిపించే అందమైన చిత్రాలను చూసి యువతులు తమను తాము తక్కువగా భావించుకోవద్దని సూచించారు. తన వ్యక్తిత్వం, అందం, కెరీర్‌ విషయంలో తల్లి శ్రీదేవి ప్రభావం ఎంతో ఉందని జాన్వీ మరోసారి గుర్తుచేశారు.