ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నా..

ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నా..
  • – మంచి భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నా: రేఖ వేదవ్యాస్‌

హైదరాబాద్‌, నవంబరు 5 (సేనాని ప్రతినిధి):
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి రేఖ వేదవ్యాస్‌ తన వ్యక్తిగత జీవితం, వివాహం, ప్రేమ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నానని, తనను నిజంగా ప్రేమించే మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌తో పోలుస్తూ, చివరికి తామిద్దరమే ఒంటరిగా మిగిలిపోతామేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నప్పటికీ, మనసుకు నచ్చే వ్యక్తి దొరకడం కష్టంగా మారిందన్నారు.
అందం కంటే మంచి మనసుకే ప్రాధాన్యత
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంలో గతంలో ఎన్నో ఆలోచనలు ఉండేవని రేఖ తెలిపారు. చిన్నతనంలో వంద అంశాలతో కూడిన జాబితా తయారు చేసుకునేదాన్నని, ఇప్పుడు అలాంటి పట్టింపులేమీ లేవని చెప్పారు. తనను నిజంగా ప్రేమించే, నిజాయతీగా ఉండే మంచి వ్యక్తి అయితే చాలని పేర్కొన్నారు. ఎత్తు, రంగు, బాహ్య సౌందర్యం వంటి వాటికి తాను ప్రాధాన్యత ఇవ్వనని, మనిషి గుణమే ముఖ్యమని స్పష్టం చేశారు. తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా నిజమైన సంబంధం కోరుకునేవారు సందేశం పంపవచ్చని సరదాగా అన్నారు.
ప్రేమకు అర్థం వివరించిన నటి
ప్రేమలో క్రష్‌, ఆకర్షణ, వ్యామోహం, నిజమైన ప్రేమ మధ్య తేడాలను రేఖ వివరించారు. ఒక వ్యక్తిని చూసి కలిగే తాత్కాలిక ఆకర్షణ క్రష్‌ అని, ఆ వ్యక్తి తన జీవిత భాగస్వామి అయితే బాగుంటుందనే ఆలోచన మరో దశ అని చెప్పారు. అయితే ఒక వ్యక్తి తనకే కావాలనే పట్టుదల వ్యామోహంగా మారుతుందని, అది సరైన ప్రేమ కాదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక వ్యక్తిని ఇష్టపడి, వారితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడటమే నిజమైన ప్రేమ అని పేర్కొన్నారు. ప్రతి మనిషిలో మంచి, చెడు లక్షణాలు ఉంటాయని, వాటిని అర్థం చేసుకుని అంగీకరించడమే ప్రేమలో ముఖ్యమని చెప్పారు.
కష్టకాలంలో తోడుంటేనే నిజమైన ప్రేమ
ఒక వ్యక్తి ప్రేమ నిజమైనదో కాదో తెలుసుకోవాలంటే వారి ప్రవర్తనను కొంతకాలం గమనించాలని రేఖ సూచించారు. మంచి సమయాల్లో చాలామంది తోడుగా ఉంటారని, అనారోగ్యం లేదా కష్టాలు ఎదురైనప్పుడు ఎవరు అండగా నిలుస్తారన్నదే ముఖ్యమని అన్నారు. మూడు నుంచి ఆరు నెలల పాటు ఒకరితో కలిసి ప్రయాణిస్తే వారి స్వభావం, ప్రేమలోని నిజాయతీ అర్థమవుతాయని తెలిపారు. ఇతరులను మోసం చేసినవారికి కర్మ తప్పదని తాను నమ్ముతానన్నారు. మనుషుల నుంచి తప్పించుకున్నా, చేసిన పనుల ఫలితాల నుంచి తప్పించుకోలేమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.