జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
  • – ఐదు రెవెన్యూ డివిజన్లలో కేంద్రాల ఏర్పాటు
  • – వేర్వేరు కళాశాలల్లో ఓట్ల లెక్కింపునకు సదుపాయాలు
  • – అధికారుల మధ్య సమన్వయానికి కలెక్టర్ ఆదేశాలు
  • – ఏర్పాట్లను వెల్లడించిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

కడప, నవంబర్ 6 (సేనాని ప్రతినిధి): జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన వసతులు కల్పించినట్లు వివరించారు. సంబంధిత మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు కోసం ముందుగానే కేంద్రాలను గుర్తించి ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బి.కోడూరు, మైదుకూరు, శ్రీ అవధూత కాశీనాయన, బి.మఠం, గోపవరం, కలసపాడు, పోరుమామిళ్ల మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం బద్వేల్‌లోని అంబేద్కర్ గురుకులంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మైలవరం, దువ్వూరు, పెద్దముడియం, ప్రొద్దుటూరు మండలాలకు సంబంధించి జమ్మలమడుగులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుంది. పులివెందుల రెవెన్యూ డివిజన్ పరిధిలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాలకు సంబంధించి పులివెందులలోని రమణప్ప సత్రం, జెడ్పీ ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా మండలాల ఎన్నికల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నందలూరు, రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం రాజంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐదు రెవెన్యూ డివిజన్లలో కేంద్రాల ఏర్పాటు పూర్తికావడంతో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు, విధుల నిర్వహణలో సమన్వయం వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు.
ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి విభాగం తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని, పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎన్నికల లెక్కింపు సజావుగా పూర్తయ్యేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.