జిన్నా షరీఫ్‌కు అండగా ఉంటాం.. ధైర్యంగా ముందుకు సాగండి

జిన్నా షరీఫ్‌కు అండగా ఉంటాం.. ధైర్యంగా ముందుకు సాగండి
  • – రాయచోటిలో జిన్నా షరీఫ్ కుటుంబానికి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరామర్శ
  • – బెయిల్‌పై విడుదలైన వైఎస్సార్‌సీపీ నాయకుడితో భేటీ
  • – కేసుల పరిణామాలు, కుటుంబ సభ్యుల ఇబ్బందులపై ఆరా
  • – న్యాయపరమైన సహకారం అందిస్తామని భరోసా

రాయచోటి, నవంబర్ 13 (సేనాని ప్రతినిధి): ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు కేసులు ఎదుర్కొని బెయిల్‌పై విడుదలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, మైనారిటీ నాయకుడు జిన్నా షరీఫ్‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని జిన్నా షరీఫ్ నివాసానికి వెళ్లిన ఆయన, జిన్నా షరీఫ్‌తో పాటు ఆయన సోదరులు, కుమారులను ఆప్యాయంగా పలకరించారు. కేసుల కారణంగా కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.
రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. అక్రమ కేసులు, రాజకీయ ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో గతంలో కంటే మరింత చురుగ్గా పాల్గొనాలని కోరారు. జిన్నా షరీఫ్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. కేసు విషయంలో న్యాయవాదులతోనూ చర్చించారు. గతంలో జిన్నా షరీఫ్ కడప కేంద్ర కారాగారంలో ఉన్న సమయంలో పలుమార్లు పరామర్శించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందనే భయంతోనే అధికార పార్టీ నాయకులు జిన్నా షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. ఆయుధాల సరఫరా, బీహార్ తదితర ప్రాంతాల నుంచి వ్యక్తుల రాకపై అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. జిన్నా షరీఫ్ తీసుకొచ్చిన ఆయుధాలు అఖిల భారత స్థాయి అనుమతి కలిగిన సంస్థ ద్వారా పొందినవని, వాటిని తీసుకొచ్చిన వారు విశ్రాంత సైనికులని, వ్యక్తిగత భద్రత కోసమే వాటిని ఏర్పాటు చేసుకున్నారని తెలిసినా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు.
పేదలకు అండగా నిలుస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మైనారిటీ వర్గాల్లో గుర్తింపు పొందిన జిన్నా షరీఫ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ చర్యలకు పాల్పడ్డారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. జిన్నా షరీఫ్‌తో పాటు ఆయన సోదరులు, ఇద్దరు కుమారులు, డ్రైవర్లు, వ్యక్తిగత భద్రత కోసం వచ్చిన వారిపైనా కేసులు నమోదు చేయడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడం, వాహనాలను దహనం చేయడం, ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలే తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని, వ్యవస్థలను ఉపయోగించుకోవడం సరికాదన్నారు.
జిన్నా షరీఫ్ కేసును పరిశీలించిన న్యాయస్థానం ఆయుధాలకు అనుమతులు ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పోలీసు యంత్రాంగానికి వాస్తవ పరిస్థితులు తెలిసినా కుట్రపూరితంగా వ్యవహరించారని తమకు స్పష్టమవుతోందని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని పాలకులు గుర్తుంచుకోవాలని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన వారు భవిష్యత్తులో చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు నవాజ్, సుగవాసి శ్యామ్, ఆర్ట్స్ శంకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, యూసుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.