కమిన్స్‌పై వార్నర్‌ సంచలన ఆరోపణలు

కమిన్స్‌పై వార్నర్‌ సంచలన ఆరోపణలు

సిడ్నీ, నవంబరు 13 (సేనాని ప్రతినిధి): ఆస్ట్రేలియా క్రికెట్‌లో 2018 నాటి శాండ్‌పేపర్‌ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా తన ఆత్మకథలో చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం తాజాగా డేవిడ్‌ వార్నర్‌ వ్యాఖ్యలతో మరింత ముదిరింది. ప్రస్తుత టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌పై వార్నర్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారంలో ఖవాజాను కమిన్స్‌ బలిపశువును చేశాడని విమర్శించాడు. ఖవాజా తన పుస్తకంలో రాసిన విషయాలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు.
సిడ్నీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేప్‌టౌన్‌ టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ ప్రణాళిక గురించి తనకు ఏమాత్రం తెలియదని కమిన్స్‌ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఫాక్స్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన వార్నర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఖవాజా చెప్పిన విషయాలు నిజమని, కమిన్స్‌ వ్యాఖ్యలు తనను నిరాశకు గురిచేశాయని తెలిపాడు. జట్టులో జరిగిన పరిణామాలపై పూర్తి నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఖవాజా తన ఆత్మకథ ‘సబ్ర’లో బాల్‌ ట్యాంపరింగ్‌ విషయం జట్టులోని పలువురికి తెలుసని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ప్రస్తావించాడు. అయితే అప్పట్లో క్రికెట్‌ ఆస్ట్రేలియా జరిపిన విచారణలో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ మాత్రమే దోషులుగా తేలారు. ఈ ముగ్గురిపైనే చర్యలు తీసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వివాదం కారణంగా తాము ముగ్గురం ఎంతో మూల్యం చెల్లించుకున్నామని వార్నర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పును అంగీకరించినప్పటికీ ఇప్పటికీ విమర్శలు, అవమానాలు ఎదుర్కొంటున్నామని తెలిపాడు. తమపై జీవితకాల శిక్ష విధించినట్లుగా పరిస్థితులు మారాయని వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారం తన వ్యక్తిగత జీవితంపైనా తీవ్ర ప్రభావం చూపిందని, ఆ సమయంలో తన భార్య గర్భస్రావానికి గురై పుట్టబోయే బిడ్డను కోల్పోయామని భావోద్వేగానికి లోనయ్యాడు.
నాటి విచారణ కూడా హడావుడిగా, సరైన విధానంలో జరగలేదని వార్నర్‌ ఆరోపించాడు. మొత్తం బాధ్యతను ముగ్గురిపైనే నెట్టి విచారణను ముగించారని, తమ వాదనలు పూర్తిగా వినలేదని పేర్కొన్నాడు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే వరకు చర్చ కొనసాగుతూనే ఉంటుందని అభిప్రాయపడ్డాడు. వార్నర్‌ తాజా వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో 2018 నాటి ఘటన మరోసారి చర్చకు వచ్చింది.