కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే అరెస్టులా?

కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే అరెస్టులా?
  • – బాలరాజు యాదవ్ అరెస్టుపై రాజీవ్ సాగర్ ఆగ్రహం
  • – ప్రశ్నించే గొంతులను పోలీసు చర్యలతో ఆపలేరు
  • – ప్రభుత్వంపై నిలదీస్తే కేసులు పెడతారా?
  • – కేసులు ఉపసంహరించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 6 (సేనాని ప్రతినిధి): ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, ఆ హక్కును పోలీసు చర్యలతో అడ్డుకోవాలని చూడటం సరికాదని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయ విమర్శలకు ప్రతిపక్ష నేతలు సమాధానం చెప్పడం సహజమని రాజీవ్ సాగర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, వాటికి బాలరాజు యాదవ్ రాజకీయంగా స్పందిస్తే పోలీసు కేసులతో అణచివేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెప్పాలే తప్ప అరెస్టుల ద్వారా ప్రతిపక్షాలను భయపెట్టకూడదని హితవు పలికారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారు చేసే విమర్శలు రాజకీయ వ్యాఖ్యలుగా పరిగణించినప్పుడు, వాటికి ప్రతిపక్షాలు ఇచ్చే సమాధానాలు నేరాలుగా ఎలా మారుతాయని నిలదీశారు. ప్రశ్నించే గొంతుకలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇది ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, వాటిని గుర్తుచేసే నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని రాజీవ్ సాగర్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వారిని అరెస్టులతో భయపెట్టడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు. విమర్శలను స్వీకరించి, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బాలరాజు యాదవ్‌పై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆయనను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని మేడే రాజీవ్ సాగర్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతును అణచివేయాలనే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు, ప్రశ్నించే హక్కుకు గౌరవం ఇవ్వాలని, రాజకీయ విమర్శలను పోలీసు కేసులతో ఎదుర్కోవడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.