కరుణ, అహింసే మానవాళికి మార్గదర్శకం

* ‘మన కాలం బుద్ధుడు’ పుస్తకావిష్కరణలో వెంకయ్య నాయుడు
* దలైలామా జీవితం, బోధనలకు అక్షరరూపం
* నిత్య జీవితంలో మానవీయ విలువలు ఆచరించాలి
* రచయిత అరవింద్ యాదవ్‌కు అభినందనలు
హైదరాబాద్, నవంబర్ 6 (సేనాని ప్రతినిధి): కరుణ, సహనం, అహింస, శాంతి వంటి మానవీయ విలువలు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలోనూ ఆచరణలో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన ‘మన కాలం బుద్ధుడు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన అంతర్జాల మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తకంలోని అంశాలు, 14వ దలైలామా జీవితం, ఆయన బోధనలు, మానవీయ సందేశాలు సమాజానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల మధ్య ప్రేమాభిమానాలు, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ఇటువంటి రచనలు దోహదపడతాయని పేర్కొన్నారు.
14వ దలైలామా జీవిత ప్రయాణం, ఆయన అనుభవాలు, ప్రపంచానికి అందించిన సందేశాలను ఈ పుస్తకం కళ్లకు కట్టినట్లు వివరించిందని వెంకయ్య నాయుడు అన్నారు. దలైలామా బోధనల్లో కరుణ, సహనం, అహింస, శాంతికి అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. మనిషి తన వ్యక్తిగత జీవితంలో ఈ విలువలను పాటించినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇతరుల పట్ల దయ, సానుభూతి చూపడం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించడం ప్రతి ఒక్కరిలో అలవాటుగా మారాలని సూచించారు. మానవత్వమే అన్ని విలువలకు పునాది కావాలని ఆకాంక్షించారు.
ప్రతి రోజూ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని వెంకయ్య నాయుడు సూచించారు. మనిషి తన ఆలోచనా విధానాన్ని సానుకూలంగా మార్చుకోవడం కంటే గొప్ప సంస్కరణ మరొకటి లేదని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా వ్యక్తుల్లో మార్పు మొదలుకావాలని తెలిపారు. ద్వేషం, అసహనం, వివక్షకు తావులేకుండా పరస్పర అవగాహనతో జీవించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత ప్రవర్తనలో సానుకూలత పెరిగినప్పుడే కుటుంబాలు, సమాజం ప్రశాంతంగా ఉండగలవని పేర్కొన్నారు.
భిన్నత్వాలను గౌరవిస్తూ, పరస్పర అవగాహనతో సామరస్యంగా జీవించడమే నేటి సమాజానికి అత్యంత అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. మతాలు, సంస్కృతులు, భాషలు, ఆచారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ మానవత్వం అందరినీ కలిపే శక్తిగా నిలుస్తుందని వివరించారు. శాంతి, సహనం, కరుణ వంటి విలువలను యువతకు చిన్ననాటి నుంచే అలవాటు చేయాలని సూచించారు. వ్యక్తుల మధ్య విభేదాలు ఉన్నా పరస్పర గౌరవం, సంయమనం పాటించడం ద్వారా సామాజిక ఐక్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. దలైలామా సందేశాలు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
14వ దలైలామా జీవితం, బోధనలను అక్షరబద్ధం చేసిన రచయిత, సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ అరవింద్ యాదవ్‌ను వెంకయ్య నాయుడు అభినందించారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయుడు మెరుగుమాల నాంచారయ్య కృషిని ప్రశంసించారు. దలైలామా ఆలోచనలు, మానవీయ సందేశాలు తెలుగు పాఠకులకు చేరేలా చేసిన ఈ ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి పుస్తకాలు సమాజంలో మంచి ఆలోచనలు, మానవీయ విలువలు, శాంతి భావనలను పెంపొందించేందుకు ఉపయోగపడతాయని ఆకాంక్షించారు.