కొడంగల్‌లో ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన

కొడంగల్‌లో ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన
  • – రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులకు శ్రీకారం
  • – మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం
  • – రేడియల్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
  • – నవంబర్‌ 9న రైతు బహిరంగ సభ.. 50 వేల మందికి ఏర్పాట్లు

కొడంగల్‌, నవంబర్ 5 (సేనాని ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవంబర్‌ 7, 8, 9 తేదీల్లో మూడు రోజులపాటు కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో నిర్వహించే మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు, నిర్మాణాలు పూర్తయిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యమిస్తూ పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు.
నవంబర్‌ 7వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హకీంపేటకు చేరుకుని మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభిస్తారు. అనంతరం రైతు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన శిబిరాలను సందర్శిస్తారు. ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశమై పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై సమీక్షిస్తారు. అక్కడి నుంచి కొడంగల్‌కు చేరుకుంటారు. నవంబర్‌ 8న హకీంపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగే సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. లగచర్ల పారిశ్రామిక కారిడార్‌లో రూ.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్‌ పామాయిల్‌ కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు.
అదే రోజు హకీంపేటలో నాట్కో సంస్థ సామాజిక బాధ్యత నిధులతో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలను, రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాలను ప్రారంభిస్తారు. కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయ భవనాలను, దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌, రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సర్‌ సీవీ రామన్‌ విజ్ఞాన ప్రదర్శనశాల, దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు.
కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్‌ రోడ్డు-2కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని కొత్తవల్గూడ నుంచి నాచారం మీదుగా జాతీయ రహదారి 167ఎన్‌ వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. మొత్తం రూ.9,053.48 కోట్లతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనుల్లో రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి తారు రహదారుల నిర్మాణం, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ రెండో దశ పనులు ఉన్నాయి. విద్యారంగంలో రూ.118.80 కోట్లతో పది తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణం చేపట్టనున్నారు. కొడంగల్‌, కోస్గి, మద్దూరులో రూ.41.83 కోట్లతో ఆధునిక బస్టాండ్లు, మద్దూరులో రూ.20 కోట్లతో నిర్మాణ నైపుణ్య శిక్షణ కేంద్రం, మరో రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్‌ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్‌ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్‌ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు. హకీంపేట పారిశ్రామిక కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్‌ నిర్మాణం చేపట్టనున్నారు.
నవంబర్‌ 9వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి కొడంగల్‌ నివాసం నుంచి హకీంపేటకు చేరుకుని రైతు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మొత్తం రూ.46.08 కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకున్న పలు ప్రభుత్వ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనతోపాటు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.