కోస్గిలో సైన్స్ మ్యూజియం ప్రారంభానికి సన్నాహాలు

కోస్గిలో సైన్స్ మ్యూజియం ప్రారంభానికి సన్నాహాలు
  • – రూ.5 కోట్లతో సర్ సి.వి. రామన్ విజ్ఞాన ప్రదర్శనశాల
  • – రెండు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం
  • – పరికరాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచన
  • – విద్యార్థులకు వివరించేందుకు ప్రత్యేక విజ్ఞానశాస్త్ర అధికారి నియామకం

కోస్గి, నవంబర్ 4 (సేనాని ప్రతినిధి): నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సర్ సి.వి. రామన్ సైన్స్ మ్యూజియాన్ని అన్ని హంగులతో త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మ్యూజియాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వివిధ రకాల పరికరాలను పరిశీలించి, వాటి అమరికపై అధికారులకు పలు సూచనలు చేశారు. మిగిలిన పనులన్నింటినీ మరో రెండు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న విజ్ఞానశాస్త్ర పరికరాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులుకు కలెక్టర్ సూచించారు. పరికరాలను ఎలాంటి రక్షణ లేకుండా బహిరంగంగా ఉంచకూడదని, వాటి పరిరక్షణ కోసం తగిన పరిమాణంలో గాజు పలకలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు పరికరాలను దగ్గరగా పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తూనే వాటికి ఎలాంటి నష్టం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి విజ్ఞానశాస్త్ర పరికరం వెనుక భాగంలో దాని పేరు, ఉపయోగం, పనితీరు, దానికి సంబంధించిన శాస్త్రీయ సూత్రాలను వివరించే సమాచార చార్టులను పెద్ద పరిమాణంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు పరికరాన్ని చూస్తూనే దాని పనితీరు, ఉపయోగాన్ని చదివి సులభంగా అర్థం చేసుకునేలా వివరాలు రూపొందించాలని పేర్కొన్నారు. సమాచారం సరళమైన భాషలో ఉండాలని, క్లిష్టమైన శాస్త్రీయ అంశాలను కూడా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించాలని అధికారులకు సూచించారు.
మ్యూజియం ఆవరణలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిసరాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, ప్రదర్శనశాల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మ్యూజియాన్ని సందర్శించినప్పుడు విజ్ఞానంతో పాటు ఆహ్లాదకరమైన అనుభూతి పొందేలా పరిసరాల అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. మ్యూజియం ప్రారంభమైన తర్వాత పరికరాల పనితీరును విద్యార్థులకు వివరించేందుకు ప్రత్యేకంగా ఒక విజ్ఞానశాస్త్ర అధికారిని నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. మ్యూజియంలో అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసి నిర్ణయించిన గడువులోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, ప్రజారోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీర్ విజయ్ భాస్కర్, హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం సంచాలకుడు సుబ్రహ్మణ్యం, జిల్లా విజ్ఞానశాస్త్ర అధికారి భానుప్రసాద్, కోస్గి మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ కళ్యాణి, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సహాయ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.