కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రదాడి

కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రదాడి
  • * కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు
  • * ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
  • * మోటార్‌సైకిల్‌పై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు
  • * నిందితుల కోసం భద్రతా బలగాల విస్తృత గాలింపు

న్యూఢిల్లీ, నవంబర్‌ 11 (సేనాని ప్రతినిధి): జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) శిబిరం సమీపంలో బుధవారం ఉగ్రదాడి చోటుచేసుకుంది. చెక్‌పాయింట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సుమారు 2.15 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చెక్‌పాయింట్‌ వద్ద ఉన్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన జవాన్లు 46వ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌కు చెందినవారిగా గుర్తించారు. వారిని మెరుగైన వైద్యం కోసం అనంతనాగ్‌ జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు.
దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఘటనా స్థలం చుట్టూ అదనపు బారికేడ్లు ఏర్పాటు చేసి, సాయుధ వాహనాలతో భారీగా బలగాలను మోహరించారు. క్విక్‌ రియాక్షన్‌ బృందాలు రంగంలోకి దిగి శిబిరం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిందితులు ఏ మార్గంలో వెళ్లారనే అంశంపై ఆరా తీస్తూ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానితుల కోసం తనిఖీలను ముమ్మరం చేశాయి.
భద్రతా చర్యల్లో భాగంగా స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అనుమానితుల కదలికలను గుర్తించేందుకు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌ ప్రతినిధి కూడా కుల్గామ్‌లోని నాకా వద్ద కాల్పులు జరిగాయని, ముగ్గురు సిబ్బంది గాయపడ్డారని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. గాయపడిన జవాన్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కుల్గామ్‌ జిల్లాలోనే పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటిస్తున్న ప్రాంతానికి దాడి జరిగిన ప్రదేశం దూరంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో కత్రాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన మార్గాల్లో వాహనాల తనిఖీలను విస్తృతం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. నిందితుల ఆచూకీ కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది.